తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది. అక్కడ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొందాం అనుకున్నా నిత్యవసరాలు దొరకని పరిస్థితి ఉంది. జనాల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. అయితే ఇండియాలో కూడా శ్రీలంక తరహా పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని ప్రధాని మోదీని హెచ్చరించారు కేంద్ర కార్యదర్శులు, సీనియర్ అధికారులు. జాగ్రత్త పడకుంటే సంక్షోభం తప్పదని హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ కార్యదర్శులతో శనివారం ప్రధాని మోదీ జరిపిన సమావేశంలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలు అప్పుల్లో మునిగాయని… ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే శ్రీలంక పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదని మోదీకి వివరించారు. జనాకర్షక పథకాల పేరుతో అప్పులు చేస్తూ.. జనాలకు పంచిపెడుతున్నారని కార్యదర్శులు మోదీకి వివరించారు. కొన్ని రాష్ట్రాలు వ్యవహరిస్తున్న తీరును… ఈ మధ్యనే ఐదు రాష్ట్రాల్లో ఆర్థికంగా కుదేలైన ఓ రాష్ట్రంలో ప్రకటించిన హామీలను గురించి ప్రస్తావించారు. అయితే అభివ్రుద్దిపై దృషి పెట్టాలని అధికారులకు మోదీ సూచించారు. భారీ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు చెప్పారు.