ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారు చేసే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫేజ్ 2 మరియు ఫేజ్ 3 ట్రయల్స్ కోసం కొత్త రిక్రూట్ మెంట్ ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఫార్మా మేజర్ ఆస్ట్రాజెనెకా ఆపేయాలని డిసిజిఐ ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం ఉంటుందని చెప్పింది. ట్రయల్ లో భాగంగా ఇప్పటికే టీకాలు వేసిన వారికి భద్రతా పర్యవేక్షణను పెంచాలని దీనికి సంబంధించి ప్రణాళికా నివేదికను సమర్పించాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) ను ఆదేశించింది.
ముందస్తు జాగ్రత్త చర్యగా అస్ట్రాజెనెకా నాలుగు దేశాలలో వ్యాక్సిన్ పరీక్షలను నిలిపివేసిన తరువాత… వచ్చే వారం భారతదేశంలో ప్రారంభం కానున్న 3 వ దశ ట్రయల్స్‌కు విరామం ఇస్తామని అదార్ పూనవల్లా నేతృత్వంలోని సీరం ఇన్స్టిట్యూట్ గురువారం స్పష్టం చేసింది. తాము పరిస్థితిని సమీక్షిస్తున్నామని… ఆస్ట్రాజెనెకా ట్రయల్స్ పున ప్రారంభించే వరకు భారత ట్రయల్స్ ను నిలిపివేస్తున్నామని సీరం ఇన్స్టిట్యూట్ ఒక ప్రకటన చేసింది.