దిల్లీ ట్రాఫిక్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. గంటల గంటలు మండే ఎండలో.. వణికించే వర్షంలో.. ముఖ్యంగా కాలుష్యంలో వేచి చూడాల్సిందే. అయితే ఇక నుంచి ఆ ఇబ్బంది నుంచి దిల్లీ ప్రజలకు విముక్తి లభించనుందట. ఎందుకంటే దిల్లీ ట్రాఫిక్ వ్యవస్థలో పెను మార్పు చోటుచేసుకోబోతోంది. అదేంటేంటే..?
దిల్లీలో ట్రాఫిక్ నియంత్రణను మరింత సులువుగా చేపట్టేందుకు అక్కడి ప్రభుత్వం కృత్రిమ మేధ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థను తీసుకురానుంది. వచ్చే ఏడాది చివరినాటికి దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. రూ.1400 కోట్ల ఖర్చుతో చేపడుతోన్న ఈ ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజిమెంట్ సిస్టమ్ 2024 చివరి నాటికి అమలు చేస్తామని పోలీస్ ఉన్నతాధికారి సురేందర్ సింగ్ యాదవ్ తెలిపారు.
‘ఐటీఎంఎస్ సాంకేతికత అనేది కృత్రిమ మేధ ఉపయోగించి వాస్తవికంగా ట్రాఫిక్ ఏవిధంగా ఉందో అన్న విషయాన్ని అంచనా వేస్తుంది. దీని అమలు తర్వాత నగరంలో ట్రాఫిక్ పరిస్థితి తీరు మారుతుంది. వాహనాల రద్దీ, వాటి సరాసరి వేగం వంటి అంశాల ఆధారంగా పగటి సమయాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ స్వయంగా నిర్వహించుకుంటుంది. తద్వారా ట్రాఫిక్ నియంత్రణలో మానవ ప్రమేయం గణనీయంగా తగ్గుతుంది’ అని తెలిపారు.