జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షా ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఆగస్టు 6న ఈ ఫలితాలను ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నేడు వెల్లడించింది. ఈ పరీక్షల ప్రొవిజినల్ ఆన్సర్ కీ బుధవారం వెలువడే అవకాశాలున్నాయి.
ఈ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఆగస్టు 5లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు నాన్ రిఫండబుల్.
‘‘ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలను ఆగస్టు 5లోగా తెలపచ్చు. ఆ తర్వాత తుది ఆన్సర్ కీ, వ్యక్తిగత స్కోరు కార్డు, మెరిట్ లిస్ట్‌ను విడుదల చేస్తాం’’ అని ఎన్‌టీఏ అధికారులు తెలిపారు. జెయిన్ మెయిన్ 2022 ఫలితాలు, ఆన్సర్ కీని http://jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జులై 25 నుంచి 30వ తేదీ వరకు జరిగాయి. మొత్తం 6.29లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. అంతకుముందు జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించగా.. ఫలితాలను జులై 11న ప్రకటించిన విషయం తెలిసిందే.