పార్లమెంట్ సమావేశాల్లో మరోమారు గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ లండన్లో చేసిన వ్యాఖ్యలపై దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాహుల్, కాంగ్రెస్ కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా డిమాండ్ చేశారు. రాహుల్ దేశ వ్యతిరేక మూకల్లో భాగంగా మారారని ఆరోపించారు.
‘‘కాంగ్రెస్ పార్టీ ఇలా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం దురదృష్టకరం. దేశ ప్రజలు పదే పదే ఆ పార్టీని తిరస్కరిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు దేశ వ్యతిరేక టూల్‌కిట్‌లో శాశ్వత భాగస్వామిగా మారారు. భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. జీ20 సమావేశాలు మన దేశంలో జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో విదేశీ గడ్డపై మన దేశాన్ని, పార్లమెంటును రాహుల్ అవమానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్నీ అవమానపరుస్తున్నారు. తద్వారా 130 కోట్ల మంది ప్రజల తీర్పును ఆయన శంకిస్తున్నారు. ఇది దేశ ద్రోహులను బలపర్చడం కాకపోతే ఇంకేంటి?’’ అని నడ్డా ఘాటు వ్యాఖ్యలు చేశారు.