లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ వ్యవహారంలో జైలుకు వెళ్లిన ఆప్ జాతీయ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ .. మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జైలు నుంచే పాలనా వ్యవహారాలు చేస్తున్నానని చెబుతున్న ఆయన్ను.. రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం తాను ప్రజల కోసం పోరాడుతున్నానని.. అందుకే రాజీనామా చేయలేదని కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆప్‌ను ఓడించలేమని భావించిన ప్రధాని మోదీ.. తనను అరెస్టు చేయించారని ఆరోపించారు. మద్యం కుంభకోణం పెద్ద బూటకమన్న కేజ్రీవాల్.. ఒకవేళ తాను రాజీనామా చేస్తే మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా అరెస్టు చేసే అవకాశం కేంద్రంలోని బీజేపీకి ఇచ్చినట్లే అవుతుందని అభిప్రాయపడ్డారు. తర్వాత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కూడా అరెస్టు చేయవచ్చని.. అందుకే తాను రాజీనామా చేయనని తేల్చి చెప్పారు.