జూన్ మొదటి వారంలో సునీత విలియమ్స్‌ అంతరిక్ష యాత్ర

-

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడో అంతరిక్ష యాత్రకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ మధ్య ఈ యాత్ర జరిగే అవకాశం ఉంది. బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో ఆమె అంతరిక్షయానం చేయనున్నారు. ఈ వ్యోమనౌకకు ఇది తొలి మానవసహిత రోదసి యాత్ర.

ఈ నెల 6వ తేదీన దీని ప్రయోగానికి ప్రయత్నించినా సాంకేతిక సమస్యతో అది నిలిచిపోయిన విషయం తెలిసిందే. స్టార్‌ లైనర్‌ పని తీరును విశ్లేషించేందుకు ఇంజినీర్లు నిరంతరం కసరత్తు చేస్తున్నారు. వ్యోమ నౌకలోని సర్వీసు మాడ్యూల్‌లో చిన్నపాటి హీలియం లీకేజీని గుర్తించడంతో అన్ని వ్యవస్థలనూ క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఈ వ్యోమనౌకలో సునీతతో పాటు బుచ్‌ విల్‌మోర్‌ కూడా అంతరిక్షంలోకి పయనమవుతున్నారు. వీరు భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో వారం పాటు బస చేస్తారు.

ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ప్రస్తుతం స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక ఈ సేవలు అందిస్తోంది. స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి.

Read more RELATED
Recommended to you

Latest news