కేంద్రం కీలక నిర్ణయం.. ఎంపీల జీతంలో కోత..!

కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. అగ్రరాజ్యాలు సైతం ఆర్ధికంగా దెబ్బతిన్నాయి. ఇక ఇప్పుడిప్పుడే ఆర్ధికంగా మెరుగుపడుతున్న భారత్ లాంటి దేశాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు భారీగా నిధులు కేటాయిస్తుంది ప్రభుత్వం. ఇది నిజంగా దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపే అంశమే. అయితే తాజాగా ఈ మహమ్మారిపై పోరు కోసం కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దేశంలోని ఎంపీల వేతనల్లో ఏడాది పాటు 30 శాతం కోతను విధించింది.

ఈ మేరకు లోక్ సభ ఆమోదం తెలిపింది. అలాగే ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండేళ్ల పాటు నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపోతే మరోవైపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా వేతనాల కోతకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ మహమ్మారిపై పోరాటానికి నిధులను సమకూర్చడానికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది.