మణిపూర్‌లో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మొన్నటిదాక కాస్త అల్లర్లు తగ్గాయని భావించగా.. తాజాగా మరోసారి హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో.. హింస చెలరేగకుండా ఇంటర్నెట్ సేవలపై విధించిన నిషేధాన్ని ఈనెల పదో తేదీ వరకూ ప్రభుత్వం పొడిగించింది. పరిస్థితులు సద్దుమణగపోవడంతో మే 3న విధించిన ఈ నిషేధాన్ని క్రమంగా పొడిగించుకుంటూ వస్తున్నారు.
మైతేయి తెగను ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్‌ను కుకి గిరిజన తెగ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇరువర్గాల మధ్య మే 3న జరిగిన ఘర్షణల్లో 70మంది ప్రాణాలు కోల్పోయారు. సాధారణ పరిస్థితులు తేవడానికి కేంద్ర హోంశాఖ, మణిపూర్ ప్రభుత్వం అనేక చర్యలను ప్రకటించాయి. కానీ ఉద్రిక్తతలు మాత్రం తగ్గడంలేదు. దాదాపు పదివేల మంది అస్సాం రైఫిల్స్ బలగాలు మణిపూర్‌లో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నాయి. గతవారం మణిపూర్‌లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా శాంతికి కట్టుబడాలని మైతేయి, కుకి తెగలకు విజ్ఞప్తి చేశారు. రహదారులను దిగ్భంధించవద్దని కోరారు. ఆయుధాలను అప్పగించాలని సూచించగా.. కొంతమంది ఆయుధాలు అప్పగించారు.