ముంభైలో ముదురుతున్న మీజిల్స్.. 48 గంటల్లో ముగ్గురు చిన్నారులు మృతి..

-

కొన్నిసార్లు చిన్నరోగాలే పెద్ద సమస్యలను తెచ్చిపెడతాయి.. మీజిల్స్ (తట్టు) కారణంగా ముంబైలో పది రోజుల క్రితం 48 గంటల్లో ముగ్గురు చిన్నారులు చనిపోయారు. చనిపోయిన వారిలో మూడేళ్లు, ఐదేళ్ల వయస్సు ఉన్న ఇద్దరు సోదరులు, వారి బంధువైన మరొక 14 నెలల చిన్నారి ఉన్నారు. ఆయా పిల్లలకు జ్వరం, దద్దుర్ల వచ్చాయని తల్లిదండ్రులు అధికారులకు తెలిపారు. ఇప్పటివరకు ముంబైలో 29 తట్టు కేసులను అధికారులు గుర్తించారు. మీజిల్స్ కారణంగా 2018లో ప్రపంచవ్యాప్తంగా 1.40 లక్షల మరణాలు సంభవించాయట. ఎక్కువగా ఐదేళ్ల లోపు పిల్లకు ఈ వ్యాధి భారిన పడతారు. అలాగే 30 ఏళ్లు పైబడిన వారిలోనూ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది.

మీజిల్స్ (తట్టు వ్యాధి) లక్షణాలు..

తట్టు లేదా మీజిల్స్ వైరస్ ద్వారా వ్యాప్తి చెందే అంటు వ్యాధి అయినందున ఇది సోకిన వ్యక్తి నుంచి తుమ్ములు, దగ్గు, లేదా వారిని తాకినప్పుడు ఇతరులకు అంటుతుంది. ఇలా అంటిన వెంటనే లక్షణాలు కనిపించవు. 10 నుంచి 12 రోజుల్లో ఈ లక్షణాలు బయటపడుతాయి. దీని తీవ్రత 4 రోజుల నుంచి 7 రోజుల పాటు ఉంటుంది.
మీజిల్స్ లక్షణాల్లో ముఖ్యంగా దద్దుర్లు, హై ఫీవర్, కళ్లు ఎర్రగా ఉండడం, కళ్లలో నీరు ఉండడం, ముక్కు కారుతూ ఉండడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నోటి లోపలి బుగ్గ భాగంలో ఎర్రటి మచ్చలు, తెలుపు మచ్చలు ఉండడం కనిపిస్తుంది.
ముఖం, మెడ భాగంలో దద్దుర్లు కనిపించడం ప్రారంభమవుతుంది.
3 రోజుల పాటు శరీరంలోని వివిధ భాగాలకు ముఖ్యంగా చేతులు, పాదాలకు చేరుతాయి. ఐదారు రోజుల పాటు కనిపిస్తాయి.
వైరస్‌కు గురైన 7వ రోజు నుంచి 18వ రోజు వరకు దద్దుర్లు కనిపించవచ్చు.
మీజిల్స్ వ్యాధి తీవ్రంగా ఉంటే శ్వాస కోశ వ్యాధులకు దారితీస్తుంది. ముఖ్యంగా న్యుమోనియాకు గురవుతారు. అలాగే అంధత్వం రావడం, మెదడువాపు వ్యాధి బారిన పడడం సంభవిస్తుంది. తీవ్రమైన విరేచనాలకు దారితీస్తుంది. పౌష్టికాహార లోపం ఉన్నప్పుడు, ముఖ్యంగా విటమిన్ ఏ లోపం ఉన్నప్పుడు మీజిల్స్ వ్యాధి తీవ్ర ఎక్కువగా ఉంటుంది. తట్టు వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు చిన్నారులు అంగవైకల్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇది ప్రాణాంతకమైన వ్యాధిగా పరిగణిస్తారు.

మీజిల్స్ నివారణకు మార్గాలు

మీజిల్స్‌కు ఇప్పటి వరకు నిర్ధిష్టమైన యాంటీ వైరల్ ట్రీట్మెంట్ లేదు. రీహైడ్రేషన్ ద్రావణంతో డీహైడ్రేషన్ చికిత్సను వైద్యులు సిఫారసు చేస్తారు. అలాగే ఈ వ్యాధి సోకినప్పుడు కనిపించే లక్షణాలను బట్టి యాంటీబయాటిక్స్ ఇస్తారు. అలాగే వ్యాధిని గుర్తించిన వెంటనే తక్షణం విటమిన్ ఏ సప్లిమెంట్లనూ ఇస్తారు.

టీకా తప్పనిసరి..

మీజిల్స్ నుంచి రక్షణకు తప్పనిసరిగా టీకా ఇప్పించాలి. టీకా తీసుకోని చిన్నారులు, గర్భిణులకు ఈ వ్యాధి ప్రమాదం ఎక్కువ. అందువల్ల టీకా కచ్చితంగా తీసుకోవాలి. మీజిల్స్ టీకా సింగిల్‌గానూ, కాంబినేషన్‌లోనూ లభిస్తుంది. రూబెల్లా, గవద బిళ్లల వాక్సిన్‌లతో కలిపి ఎంఎంఆర్ వాక్సిన్ రూపంలో ఇస్తారు. సింగిల్‌‌గా తీసుకున్నా, కాంబినేషన్‌లో తీసుకున్నా సమర్థవంతంగా పనిచేస్తుంది

Read more RELATED
Recommended to you

Latest news