దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాలూ పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ కరోనా విజృంభణ ఇంకా ఎక్కడా తగ్గకపోగా పెరుగుతోంది. ఢిల్లీలోనూ పరిస్థితి ఇలానే ఉంది. అయినప్పటికీ.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం కేసులు తగ్గుతున్నాయని చెప్పకపోయినా.. రికవరీల శాతాన్ని మాత్రం చెబుతుండడం గమనార్హం. అదేసమయంలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఏకరువు పెడుతోంది. అసలు కేసులు ఏమీలేనప్పుడు లాక్‌డౌన్ అంటూ హడావుడి చేశారు. కేంద్ర బలగాలను సైతం రంగంలోకి దించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.
అయితే, ఇప్పుడు 60 వేల మంది చనిపోయినా.. ఒక్కొక్క రాష్ట్రంలో కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోయినా.. లాక్‌డౌన్ ను మాత్రం దఫదఫాలుగా ఎత్తేస్తుండడం గమనార్హం. రేపోమాపో మరోసారి అన్‌లాక్ 4.0పేరుతో మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నారు. సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. బ్యూటీపార్లర్లు, పార్కులకు కూడా ఆమోదముద్ర వేయనున్నారని సమాచారం. మరి ఇంతగా కరోనా విజృంభిస్తున్నా.. ఏమీలేదన్నట్టుగా.. లాక్‌డౌన్‌ను ఎత్తేయడం వెనుక ఉన్న కారణమేంటి? ఏం జరుగుతోంది? అనేది చాలా ఆసక్తిగా మారింది.
కేంద్రంలోని మోడీ సర్కారు.. ఏం చేసినా.. తమకు ముప్పావలా లాభం లేకుండా ఏమీ చేయదని అంటారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ను దఫదఫాలు ఎత్తేయడం వెనుక రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి త్వరలోనే మూడు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడం, రెండు.. కేంద్రంపై ఆర్థిక భారం తగ్గించుకోవడం. దీనిలో మొదటిది అత్యంత కీలకం. ఇంత కరోనా ఎఫెక్ట్‌లోనూ ఇటీవల అయోధ్యలో రామమందిరానికి భూమి పూజ చేశారు. దీనిని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలంటే.. బిహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో గెలుపు గుర్రం ఎక్కాలంటే.. ఖచ్చితంగా ఎన్నికలు జరగాలి.
లాక్‌డౌన్ ఉంటే అది సాధ్యం కాదు. అందుకే వ్యూహాత్మకంగా మోడీ వ్యవహరిస్తున్నారు. ఇక, ఆర్థికంగా రాష్ట్రాలు నష్టపోయాయి. దీంతో తమను ఆదుకోవాలంటూ. కేంద్రంపై పడుతున్నాయి. ఈ బారి నుంచి రక్షించుకునేందుకు మోడీ.. లాక్‌డౌన్ ఎత్తేసి రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించారు. మొత్తానికి మోడీ వ్యూహం ఇదేనంటున్నారు జాతీయ స్థాయి రాజకీయ విశ్లేషకులు.