గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. గుజరాత్‌ను తమ గుప్పిట్లో నుంచి జారనీయకుండా మోదీ సరికొత్త నినాదాన్ని అందుకున్నారు. ‘‘గుజరాత్‌ను నేనే తయారు చేశాను’’ అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని అన్నారు. ‘‘ప్రతి గుజరాత్ పౌరుడు గుండెల నిండా ఆత్మవిస్వాంతో ఉంటారు. అందుకే వాళ్లు మాట్లాడిన ప్రతి మాట గుండె లోతుల్లోంచి వస్తుంది. ‘నేను ఈ గుజరాత్‌ను తయారు చేశాను’.. అనే మాట ప్రతి ఒక్కరిమనస్సులో నాటుకుపోవాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు.
గుజరాత్ కాప్రద జిల్లాలోని ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ రాష్ట్రాన్ని అభాసుపాలు చేస్తోందంటూ పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. గత 20 సంవత్సరాలుగా రాష్ట్ర పరువు తీసేందుకు యత్నిస్తున్న విభజన శక్తులకు గుజరాత్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మోదీ వ్యాఖ్యానించారు. ఆదివాసీల అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తోందని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన బీజేపీ..ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గుజరాత్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్ నిర్వహించి, డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.