- ఢిల్లీ, రాజస్థాన్ లలో నమోదైన కేసులు
న్యూఢిల్లీ: ప‌్రధాని మోడీ చేతుల మీదుగా దేశవ్యాప్తంగా శనివారం కరోనా టీకా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే, టీకాలు తీసుకున్న వారిలో పలువురికి వెంటనే అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి సంబంధించి 52 మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కలిగాయి. వీరిలో ఒకరికీ తీవ్ర అనారోగ్యం కలగడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శనివారం రోజు దేశరాజధానిలో మొత్తం 4,319 మందికి కోవిడ్-19 టీకాలు వేశారు. అలాగే, రాజస్థాన్‌లోనూ సైడ్ ఎఫెక్ట్ కేసు వేలుగుచూసినట్టు సమాాచారం.
ప్రస్తుతం వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ నమోదైన కేసులు దక్షిన ఢిల్లీ, సౌత్ వెస్ట్ ఢిల్లీలలో నమోదయ్యాయి. ఈ రెండు ప్రాంతాల్లోనే 11 మందికి పైగా టీకా తీసుకుని అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చారక్ పాలిక ఆస్పత్రికి చెందిన ఇద్దరు వైద్యులు కూడా ఉన్నారు.
కాగా, టీకా డ్రైవ్ ప్రారంభమైన మొదటి రోజు దేశవ్యాప్తంగా మూడు లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, మొదటి రోజు కేవలం 1,91,181 మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాను వేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో మొత్తం 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 3,352 సెంటర్లలో వ్యాక్సిన్ ఇచ్చారు. భారతీయ భద్రతా దళాలకు చెందిన 3,429 మంది సిబ్బంది కూడా వ్యాక్సిన్ అందించారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండు టీకాలను దేశంలోని 11 రాష్ట్రాలు మాత్రమే ఉపయోగించాయి.