రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ నేడు రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతుండగా.. విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశాయి. దీనిపై ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ప్రతిపక్షాలు తమ ప్రవర్తనతో రాజ్యసభను అవమానపర్చాయని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. అసలేం జరిగిందంటే?
ప్రధాని మోదీ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా విపక్ష ఎంపీలు గట్టిగట్టిగా నినాదాలు చేశారు. వారి ఆందోళన నడుమే మోదీ ప్రసంగం కొనసాగించారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ క్రమంలో మోదీ ప్రసంగాన్ని నిలిపివేశారు.
ఈ పరిణామాలపై రాజ్యసభ ఛైర్మన్ మాట్లాడుతూ..విపక్ష నేతలు సభను కాదు మర్యాదను విడిచి వెళ్లారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ప్రతి సభ్యుడికి అవకాశం ఇస్తున్నాం వారు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారని వాపోయారు. రాజ్యాంగంపై హేళనగా ప్రవర్తించడం సమంజసం కాదని హితవు పలికారు. “రాజ్యాంగం అనేది చేతిలో పుస్తకం కాదు. జీవితానికి మార్గదర్శకం’’ అని విపక్షాలపై మండిపడ్డారు.