కరోనా(corona) నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు దేశంలో అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లను అమలు చేశారు. కోవిడ్ రెండో వేవ్ ప్రభావం తగ్గుతున్న కొద్దీ లాక్‌డౌన్‌ను, ఆంక్షలను ఎత్తేస్తున్నారు. దీంతో పర్యాటక ప్రాంతాలు, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్‌లు, థియేటర్లు.. అన్నీ తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజలు మళ్లీ సాధారణ జీవితానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక గత కొద్ది రోజులుగా టూరిస్టు ప్లేసులకు వెళ్లాలనుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ మేరకు ఇక్సిగో అనే ట్రావెల్ సంస్థ వివరాలను వెల్లడించింది.
నిన్న మొన్నటి వరకు తమ సంస్థ ద్వారా విమాన టిక్కెట్లను బుక్ చేసుకుని ప్రయాణించే వారి సంఖ్య నెలకు 45వేలు ఉండేదని, ఇప్పుడది 1.10 లక్షలకు పెరిగిందని ఇక్సిగో తెలియజేసింది. ప్రస్తుతం చాలా నగరాల్లో ఆంక్షలను సడలిస్తున్నారు. దీంతో మా ప్లాట్‌ఫాంలో ప్రయాణాల కోసం వెదుకుతున్న వారి సంఖ్య పెరిగింది. చాలా మంది వేసవి సెలవుల కోసం లెహ్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలకు వెళ్తున్నారు.. అని ఇక్సిగో తెలిపింది.
ఇక ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లోనూ ఆంక్షలను ఎత్తేస్తున్నారు. దీంతో మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కాగా వారణాసి, దర్భంగా, పాట్నా, గోరఖ్‌పూర్ వంటి ప్రాంతాలను సందర్శిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిందని ఇక్సీగో తెలిపింది.
బెంగళూరు, ఢిల్లీ, పూణె, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, కొచ్చి, శ్రీనగర్, జమ్మూ, అమృతసర్, లక్నో, పాట్నా, గౌహతి, శ్రీనగర్‌లకు వెళ్తున్న వారి సంఖ్య బాగా పెరిగిందని ఆ కంపెనీ తెలిపింది. మరి వచ్చే నెలలో కోవిడ్ మూడో వేవ్ వస్తుందని హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.