ఇంట్లో బంగారు ఆభరణాలు ఉంటే దొంగలు పడి దోచుకెళ్తారు కానీ.. ఎవరూ అందుకు క్షమాపణలు చెప్పరు. దొంగలకు దోచుకెళ్లడమే పని. అయితే ఆ దొంగ మాత్రం ఆ ఇంటి సభ్యులకు దొంగతనం చేసినందుకు క్షమాపణలు చెప్పాడు. ఓ లెటర్ రాసి వదిలి వెళ్లాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లోని భీండ్ జిల్లా భీమ్‌నగర్ ప్రాంతంలో ఓ స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ జవాన్ తన భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అయితే అతను ప్రస్తుతం విధి నిర్వహణ నిమిత్తం చత్తీస్‌గడ్‌లో ఉన్నాడు. భార్య గత జూన్ 30న పిల్లలను తీసుకుని తన పుట్టింటికి వెళ్లింది. ఈ మధ్యే తిరిగి వచ్చింది. అయితే ఇంటికి వేసిన తాళం పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి ఇంటి లోపలికి చేరుకుని చూసింది. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడిఉన్నాయి. ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు మాయం అయ్యాయని గ్రహించింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే ఆ దొంగ వెళ్తూ వెళ్తూ ఓ లెటర్ వదిలి వెళ్లాడు. అందులో అతను క్షమాపణలు తెలిపాడు. తాను ఈ దొంగతనం చేస్తున్నందుకు తనను క్షమించాలని, తన గర్ల్ ఫ్రెండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుందని, ఆమెకు ఆపరేషన్ చేయించాలని, లేదంటే చనిపోతుందని, కనుకనే ఆభరణాలను దొంగించానని, వాటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని పని పూర్తయ్యాక వాటిని విడిపించి అందజేస్తానని, అప్పటి వరకు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. రాశాడు. దీంతో ఆ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ జవాన్ కుటుంబానికి తెలిసిన ఎవరో దగ్గరి వారే ఈ దొంగతనం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఆ దిశగా కేసు విచారిస్తున్నారు.