ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు కార్యాదక్షత అందరికీ మార్గదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వెంకయ్య పదవీకాలంలో రాజ్యసభ పనితీరు గణనీయంగా మెరుగుపడిందని గుర్తు చేశారు. ఈ నెల 10న వెంకయ్య పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. పార్లమెంట్లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ప్రసంగించిన మోదీ.. వెంకయ్యకు ధన్యవాదాలు తెలిపారు. సభకు ఇది అత్యంత భావోద్వేగపరమైన క్షణం అని పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు సమక్షంలో సభలో అనేక చారిత్రక ఘటనలు జరిగాయని గుర్తు చేసుకున్నారు.
“రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ధన్యవాదాలు. ‘రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నా. ప్రజా జీవితం నుంచి కాదు’ అని మీరు చాలా సార్లు చెప్పారు. ఈ సభను నడిపించే బాధ్యత నుంచి మీరు ప్రస్తుతం వైదొలుగుతున్నారు. కానీ, దేశంతో పాటు ప్రజల కోసం పనిచేసే నాలాంటి వ్యక్తులకు మీ అనుభవాల నుంచి నేర్చుకొనే అవకాశం ఎప్పటికీ ఉంటుంది. వెంకయ్యనాయుడి దక్షత, పనివిధానం.. మనందరికీ మార్గదర్శనం.”
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
వెంకయ్య హయాంలో రాజ్యసభ పనితీరు మెరుగుపడిందని మోదీ గుర్తు చేశారు. రాజ్యసభ ఉత్పాదకత 70 శాతం పెరిగిందని చెప్పారు. ఎంపీల హాజరు సైతం భారీగా పెరిగిందని వెల్లడించారు. వెంకయ్యతో కలిసి పనిచేసే అదృష్టం లభించడం గొప్ప విషయమని అన్నారు.
‘మీ పని విధానం ఎంతో స్ఫూర్తిదాయకం. పనిపై పెట్టే శ్రద్ధ.. బాధ్యతగా నిర్వర్తించే తీరు ప్రతిఒక్కరికి ఆదర్శం. సభా నాయకుడిగా ఎన్నో బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించారు. కొత్తతరంతో అనుసంధానమవుతూ అత్యంత జనాదరణ ఉన్న నాయకుడిగా.. అనేక బాధ్యతలను విజయవంతంగా చేపట్టారు. మీతో భుజం కలిపి పనిచేసే అదృష్టం నాకు లభించింది. సమాజం, ప్రజాస్వామ్యం గురించి మీ నుంచి చాలా నేర్చుకోవాలి. మీ అనుభవం మీ పుస్తకంలో ప్రతిబింబిస్తుంది. మీ పుస్తకంలోని ప్రతి అక్షరం యువతకు మార్గదర్శనం. మీ పుస్తకాలు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి’ అని మోదీ కొనియాడారు.