కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అగ్ర నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పిసిసి చీఫ్ డీకే శివకుమార్ ల మధ్య ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలన్న దానిపై పార్టీ స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఇద్దరు అగ్ర నేతలు ముఖ్యమంత్రి కుర్చీని చెరి రెండున్నర ఏళ్ళు పంచుకోనున్నారని తెలుస్తోంది. మొదటి రెండున్నర ఏళ్ళు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.
అయితే సీఎం పదవి ఆశించిన డీకే శివకుమార్ ను బుజ్జగించడంలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారట. ఒకటికి పదిసార్లు రాహుల్.. డీకేతో స్వయంగా మాట్లాడి బుజ్జగించారట. దీంతో డీకే వెనక్కి తగ్గారని సమాచారం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హై కమాండ్ కి నిరసన సెగ తగిలింది. ఢిల్లీలో డీకే శివకుమార్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఆయనని ముఖ్యమంత్రిని చేయాలంటూ పట్టుబడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఆయన వెన్నుముక. అయితే దత్తపుత్రుడు కావాలా..? అసలైన పుత్రుడు కావాలా..? అంటూ నినాదాలు చేస్తున్నారు డీకే శివకుమార్ మద్దతుదారులు.