ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేడు యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. గవర్నర్ వ్యవస్థను మోదీ సర్కార్ పూర్తిగా దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీయేతర ప్రభుత్వాలను వేధించేందుకు గవర్నర్‌ను వాడుకుంటున్నారని ఆరోపించారు.
“తెలంగాణ, తమిళనాడు, కేరళ, బంగాల్‌లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం గొప్పగా చెప్పుకుంటాం. భిన్న సంస్కృతులకు నిలయమైన దేశంలో ఒకే విధానాన్ని బీజేపీ ఆశిస్తోంది. భారతదేశం ఓ పుష్పగుచ్చం, ఒకే పుష్పం ఉండాలని బీజేపీ చూస్తోంది. ప్రభుత్వం ఎలెక్టెడ్, లెఫ్టినెంట్ గవర్నర్ సెలెక్టెడ్. కొందరు గవర్నర్లు రాజ్ భవన్‌ను బీజేపీ ఆఫీస్ అనుకుంటున్నారు. మరికొందరు గవర్నర్లేమో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్లుగా తమని తాము భావిస్తున్నారు. అలంకార ప్రాయమైన గవర్నర్ వ్యవస్థతో మోదీ ఏదో చేయాలనుకుంటున్నారు. త్వరలోనే దేశం మొత్తం బీజేపీకి తగిన గుణపాఠం చెబుతుంది.” – భగవంత్ సింగ్ మాన్, పంజాబ్ సీఎం