జమ్మూ కశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కశ్మీర్ లో భద్రతా పరిస్థితిపైనే ప్రధానంగా చర్చించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిణామాలపై అధికారులు హోం మంత్రికి వివరణ ఇచ్చినట్టు పేర్కొన్నాయి.
రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ కార్యకలాపాలను మరింత ఉధృతం చేసేందుకు భద్రతా బలగాలు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు అమిత్ షా పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అలాగే అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది. సందర్శకుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై పలు ఆదేశాలు జారీ చేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దేకా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఇన్ కమింగ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనిష్ దయాల్ సింగ్ వంటి అత్యున్నత భద్రతా అధికారులు పాల్గొన్నారు.