హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నార్నాల్ జిల్లా మహేంద్రగఢ్ లో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. దాదాపు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో అదుపు తప్పి బస్సు బోల్తా పడినట్టు ప్రాథమికంగా తెలిసిందని వెల్లడించారు.
మహేంద్రగఢ్ బస్సు ప్రమాదంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సీమా త్రిఖా స్పందించారు.. దోషులను వదిలిపెట్టబోమని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని, గాయపడిన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వ సెలవు దినాల్లో పాఠశాల తెరవడం చట్టాన్ని ఉల్లంఘించడమేనన్న మంత్రి.. స్కూల్ అడ్మినిస్ట్రేషన్‌పై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.