రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల లోని కొన్ని జిల్లాల్లో “గరాసియా తెగ” విస్తరించి ఉంది.వీళ్ళ సాంప్రదాయం ప్రకారం యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకోవచ్చు.ఇందుకోసం నిర్ణీత వ్యవధుల్లో రెండు రోజుల పాటు ఓ జాతర జరుగుతూ ఉంటుంది.ఇందులో భాగంగా తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకొని పెళ్లి తో సంబంధం లేకుండా అతడితో సహజీవనం చేయొచ్చు.ఇందుకు అబ్బాయి కొంత సొమ్మును అమ్మాయి కుటుంబానికి ఇస్తాడు.ఇది ఒక రకంగా ఎదురు కట్నం/ కన్యాశుల్కం గా చెప్పుకోవచ్చు.భవిష్యత్తులో ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే అప్పుడు పెళ్లి ఖర్చులు కూడా వరుడి కుటుంబ సభ్యులే భరిస్తారట.
ఈ ఆచారం అక్కడ దశాబ్దాలుగా కొనసాగుతోంది.ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి ఏళ్లపాటు సహజీవనం చేసే ఆచారం ఈ తెగలో ఉంది.ఈ క్రమంలో పిల్లల్ని కనవచ్చు.ఆ తర్వాత ఆర్థికంగా స్థిరపడి ఏ లోటు లేకుండా కుటుంబాన్ని పోషించగలమన్న ధీమా ఏర్పడ్డాకే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకోవచ్చట.ఈ పద్ధతిని “దాపా” గా పిలుస్తారు.తిరిగి పెద్దయి సహజీవనం చేస్తున్న తమ పిల్లలే వృద్ధ తల్లిదండ్రులకు పెళ్ళి చేయటం లాంటి ఘటనలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు.పైగా సహజీవనం లో ఉన్న భాగస్వామి తనను వేధించినా, ఇకపై అతడితో కొనసాగలేనని నిర్ణయించుకున్నా, అతడితో విడిపోయే హక్కు ఇక్కడి మహిళలకు కల్పించారు.