ఏక్నాథ్ శిందే మహారాష్ట్ర సీఎం కావడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శివసేన నుంచి వేరుపడిన 39 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా స్పీకర్ను అడ్డుకోకపోయి ఉంటే ఏక్నాథ్ శిందే ముఖ్యమంత్రి అయ్యుండేవారు కాదని వ్యాఖ్యానించింది. ఆ 39 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించి ఉండి ఉంటే మెజారిటీ లేక మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం కూలిపోయి ఉండేదని శిందే వర్గం సుప్రీం కోర్టుకు తెలిపింది.
ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బలపరీక్షను ఎదుర్కొనకుండానే పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు ఠాక్రే వర్గం సుప్రీం కోర్టుకు తన వాదనను వినిపిస్తూ సుప్రీంకోర్టు జూన్ 27, 2022న జూన్ 29, 2022న (విశ్వాసపరీక్షకు అనుమతించడం) ఇచ్చిన రెండు ఆదేశాల ‘ప్రత్యక్ష, అనివార్య ఫలితంగా’ శిందే నేతృత్వంలో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయిందని తెలిపింది.
ఈ పరిస్థితి న్యాయ, శాసన వ్యవస్థల మధ్య ‘సమాన, పరస్పర సమతౌల్యత’కు భంగం కలిగించిందని వివరించింది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది.