ఈసీ నియామకంపై సుప్రీం కోర్టు ఫైర్.. ఎందుకంత తొందర అంటూ..?

-

ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్ నియామక ప్రక్రియపై సుప్రీం కోర్టు ఫైర్ అయింది. ఈ విషయంలో కేంద్రం హడావుడి చేసిందంటూ మండిపడింది. అరుణ్‌ గోయల్‌ నియామక ప్రక్రియను ఆగమేఘాల మీద, త్వరితగతిన పూర్తిచేసినట్లు జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్ అర్హతలను ప్రశ్నించడం లేదన్న ధర్మాసనం.. నియామక ప్రక్రియను మాత్రమే ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది.

అరుణ్‌ గోయల్‌ నియామకానికి సంబంధించి పూర్తి దస్త్రాలను ధర్మాసనం ముందు ఉంచాలని బుధవారం సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఈ పత్రాలను సమర్పించగా వాటిని పరిశీలించిన కోర్టు… ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ‘ఒక్కరోజులోనే ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారా?’ అని ప్రశ్నించింది.

“24 గంటలు కూడా గడవక ముందే మొత్తం ప్రక్రియ పూర్తి చేశారు. ఫైల్‌ మొదలు పెట్టిన రోజు నుంచి అపాయింట్‌మెంట్‌ వరకు.. ఎంపిక ప్రక్రియ అంతా ఒకే రోజులో ఎలా జరిగింది? మే 15వ తేదీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉంది. మే 15 నుంచి నవంబర్ 18 మధ్య ఏం జరిగిందో చెప్పాలి. నలుగురి పేర్లు సిఫార్సు చేస్తే… వారిలో అరుణ్‌ గోయల్‌ పేరును మాత్రమే ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? ప్రతిపాదిత పేర్లలో అరుణ్‌ గోయల్‌ చిన్నవారు అయినా… మిగిలిన వారిని కాదని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో చెప్పాలి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టడం, అనుమానాల నివృత్తి కోసం వేసే ప్రశ్నల ద్వారా… కేంద్రానికి తాము వ్యతిరేకమని అర్థం చేసుకోవద్దు.”
-సుప్రీం కోర్టు

Read more RELATED
Recommended to you

Latest news