బిజెపి నుంచి విముక్తి పొందడం వల్లే ఇటీవల తన పెదవులపై చిరునవ్వు ఎక్కువగా కనిపిస్తోందని అన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్. జెడియు జాతీయ కౌన్సిల్ సమావేశాలలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. 2013లో ఎన్డిఏ ను వీడి మంచి పని చేశామని.. కానీ 2017లో మళ్లీ పొత్తు పెట్టుకొని పొరపాటు చేశామన్నారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న కారణంగా పలు రాష్ట్రాలలో ప్రజలు తమ పార్టీకి దూరమయ్యారని చెప్పారు.
ఇప్పుడు ఎన్డీఏతో కటీఫ్ తరువాత.. వారిలో చాలామంది తన చర్యను అభినందించారని చెప్పారు. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నానని నితీష్ కుమార్ తెలిపారు. త్వరలో ఢిల్లీ వెళ్లి పలు పార్టీలకు చెందిన నేతలతో సమావేశం అవుతానని చెప్పారు. తనకు ప్రధాని పదవిపై ఆశలు లేవని స్పష్టం చేశారు. జెడియు ఉనికిలో ఉన్నంతకాలం మళ్లీ ఎన్డీఏతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు నితీష్ కుమార్.