సైనికుల ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన అగ్నిపధ్ పథకం పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పంజాబ్ లో మాత్రం ఒక ఆసక్తికర ఘటన జరిగింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సాంగ్రూర్ ఉప ఎన్నికల్లో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. కారు రూట్ టాప్ నుంచి నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ వెళుతున్నారు.
ఈ సందర్భంలో రోడ్డుపై నిలుచున్న ఓ యువకుడు అగ్నిపధ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నాడు. అతడిని గమనించిన ముఖ్యమంత్రి వెంటనే తన కాన్వాయ్ ఆపాడు. సీఎం దగ్గరకు వెళ్లిన ఆ యువకుడు ‘అగ్నిపధ్ ను అమలు చేయడానికంటే ముందే.. అందరూ నాయకులు దాని గురించి చర్చించండీ.’ అని కోరాడు. దీంతో అగ్నిపధ్ పై ఎంపీలు ఒకవేళ సమావేశం నిర్వహిస్తే తానే స్వయంగా వెళ్తానని సీఎం అతడికి హామీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన తన కాన్వాయ్ లో ముందుకు కదిలారు.