సమాజానికి నైతికత, విలువల గురించి బోధించే సంస్థ తమది కాదని సుప్రీం కోర్టు పేర్కొంది. దేశంలో చట్టబద్ధ పాలన కొనసాగేలా చూడడం, రాజ్యంగ పరిరక్షణే దాని ప్రధాన కర్తవ్యమని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ ఎ.అమానుల్లా ధర్మాసనం స్పష్టం చేసింది.. తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి చంపిన కేసులో 20 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న మహిళను జైలు నుంచి విడుదల చేయడానికి అనుమతిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసు గురించి మాట్లాడుతూ.. పరాయి పురుషుడితో ప్రేమలో పడిన ఆమె…అతని బెదిరింపులు, ఒత్తిడితో తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే, పిల్లలిద్దరికీ విషమిచ్చిన తర్వాత ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకోబోతుండగా ఆ సమయంలో అక్కడికి వచ్చిన బంధువు ఒకరు అడ్డుకున్నారని తెలిపింది. ప్రేమికుడితో సంతోషంగా గడపడానికే ఆమె బిడ్డలను చంపిందన్న తమిళనాడు ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ఆమెను విడుదల చేయాలన్న రాష్ట్రస్థాయి కమిటీ సిఫార్సును ఆమోదించకపోవడంలో సహేతుకత కనిపించడంలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. తక్షణమే ఆమెను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.