స్థానిక ఎన్నికల్లో సీరియస్‌గా పోటీ చేస్తాం : కేటీఆర్

-

తెలంగాణలో రానున్న స్థానిక ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ తీవ్రంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏళ్లపాటు ప్రజలు మోసపోయారని, ఈసారి మళ్లీ అలాంటి మోసాలకు భయపడకుండా ప్రజలు చైతన్యంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కేటీఆర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులకు హామీగా ఇచ్చిన పథకాలపై కూడా నిలబడలేకపోయిందని విమర్శించారు. “రైతుబంధు మొదటి పంటకే సాయం లేదు. కేసీఆర్ కిట్, తులం బంగారం, ఫ్రీ బస్ ప్రయాణం వంటి హామీలు అన్ని మాయమయ్యాయి” అని ఆయన ఎద్దేవా చేశారు.

“ఒక్క ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా, ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేకపోయింది. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ సమయంలోనే ప్రారంభమైంది. భట్టి విక్రమార్క మధిరలో గెలవడానికి బాండ్ పేపర్‌పై హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీల సంగతి ఏమయ్యింది?” అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్, “ఢిల్లీలో రేవంత్ రెడ్డిని దొంగలా చూస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఆయన పాత్రపై ప్రజలకు స్పష్టత ఉంది” అని పేర్కొన్నారు.

తొందరలో భద్రాచలం ఉప ఎన్నిక వస్తుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీఆర్‌ఎస్ నేతలంతా భద్రాచలంలో సన్నద్ధంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పేదలకు నిజమైన అండగా నిలిచేది బీఆర్‌ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news