ఓ దొంగ చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. అనంతరం పారిపోతూ.. పట్టుబడిన తర్వాత పోలీసుల ఎదుట దొరకకుండా ఉండేందుకు గొలుసును మింగేశాడు. అనంతరం తనని కాపాడమని పోలీసులను వేడుకున్నాడు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని రాంచీలో చోటుచేసుకుంది.
రాంచీలో సల్మాన్, జాఫర్ అనే ఇద్దరు దొంగలు దిబ్దిహ్ వంతెన సమీపంలో రోడ్డు మీద వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాగేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. బైక్ మీద పారిపోతున్న దొంగలను కిలోమీటరు దూరం వెంబడించి పోలీసులు పట్టుకున్నారు. తాము దొంగతనం చేయలేదని తప్పించుకునేందుకు సల్మాన్ చోరీ చేసిన బంగారు గొలుసును మింగేశాడు.
అనంతరం తనను కాపాడమని దొంగ పోలీసులను వేడుకోగా.. పోలీసులు అతణ్ని రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి ఛాతీ భాగంలో బంగారు గొలుసు ఇరుక్కుపోయినట్లు వైద్యులు గుర్తించారు. గొలుసు.. ఎక్కువసేపు అలాగే ఉంటే ఇన్‌ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పడంతో తనను కాపాడాలని సల్మాన్ పోలీసులను వేడుకున్నాడు.