ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న రేడియో ప్రసారం మన్‌కీ బాత్ గత ఆదివారంతో 100 ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంపై యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే ప్రశంసలు కురిపించారు. యాభైకి మించి భాషలు, మాండలికాల్లో కోట్లాది ప్రజలు విన్న ఈ కార్యక్రమం 100వ భాగం ప్రసారాన్ని అత్యంత వేడుకగా చేసుకోతగినదని అభివర్ణించారు. ఆదివారం నాటి ఈ కార్యక్రమంలో తనను కూడా భాగస్వామిని చేసినందుకు ప్రధాని మోదీకి అజౌలే కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు మన్ కీ బాత్ కార్యక్రమంపై కాంగ్రెస్ విరుచుకు పడింది. ‘‘ఈ రోజు నకిలీ మాస్టర్(పరోక్షంగా మోదీని ఉద్దేశించి) ప్రత్యేకం. మన్ కీ బాత్ వందో ఎపిసోడ్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కానీ, ఇది చైనాతో సరిహద్దు గొడవలు, అదానీ కంపెనీ వ్యవహారం, ఆర్థిక అసమానతల పెరుగుదల, నిత్యావసరాల ధరల పెరుగుదల, జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు, మహిళా రెజ్లర్లకు జరిగిన అవమానం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేసిన అవినీతి, ఆర్థిక నేరగాళ్లతో భాజపా స్నేహ సంబంధాలు వంటి దేశంలోని అనేక సమస్యలపై నిర్వహిస్తున్న మౌన్ కీ బాత్’’ అని జైరాం ట్వీట్ చేశారు.