భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నిక శనివారం జరగనుంది. ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్(71), విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి, గవర్నర్ మార్గరెట్ ఆళ్వా (80) రంగంలో ఉన్న ఈ ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పార్లమెంటు భవనంలో కొనసాగనుంది. లోక్‌సభకు చెందిన 543, రాజ్యసభకు చెందిన 245 మంది ఎన్నికలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ప్రస్తుతం రాజ్యసభలో జమ్మూకశ్మీర్ నుంచి 4, త్రిపుర నుంచి 1, నామినేటెడ్ సభ్యులనుంచి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే నికరంగా 780 మందికి ఓటు వేసే హక్కు ఉంది. ఇందులో లోక్‌సభలో 23, రాజ్యసభలో 13 మంది సభ్యుల సంఖ్యాబలం ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినందున ఆ పార్టీకి చెందిన 36 మంది సభ్యులు మినహాయించి మిగిలిన 744 మంది ఓటింగ్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ మొదలుపెట్టి రాత్రికల్లా ఫలితం వెల్లడిస్తారు.
ఉభయసభల్లో ఎన్డీయే, దాని మిత్రపక్షాలకు స్పష్టమైన బలమున్నందున అధికారిక కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌కఢ్ గెలుపు దాదాపు లాంఛనమే.అధికార భాజపాకు లోక్‌సభలో 303, రాజ్యసభలో 91 కలిపి 394 ఓట్లున్నాయి. అభ్యర్థి గెలుపునకు కావాల్సిన 372+1కి మించిన ఓట్లు భాజపా ఒక్కదాని చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆపార్టీకి అదనంగా శివసేన, జనతాదళ్ (యూ), బీఎస్పీ, బీజేడీ, ఏఐఏడీఎంకె, వైకాపా, తెదేపా, శిరోమణి అకాళీదళ్, ఎల్‌జేపీ, ఏజీపీ, ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్, ఎంఎన్‌ఎఫ్, ఎస్‌కేఎం, ఎన్‌డీపీపీ, ఆర్‌పీఐ-ఎ, పీఎంకె, అప్నాదళ్, ఏజేఎస్‌యు, టీఎంసీ-ఎం మద్దతిస్తున్నాయి.
ప్రస్తుత లెక్కల ప్రకారం ఎన్డీయే కూటమికి 544 ఓట్లు లభించే సూచనలున్నాయి. అంటే ఎలక్టోరల్ కాలేజీలో 73% ఓట్లు ధన్‌ఖడ్‌కు దక్కే అవకాశం ఉంది. 2017 ఎన్నికల్లో అధికారకూటమి అభ్యర్థి వెంకయ్యనాయుడికి 67.89% ఓట్లు దక్కగా, ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి 32.11% వచ్చాయి. ప్రస్తుతం ప్రతిపక్షాల్లో ప్రధానమైన టీఎంసీ గైరుహాజరుకావడంవల్ల ఆ కూటమి ఓట్లకు ఆమేరకు కోతపడి, అధికార కూటమి అభ్యర్థి బలాన్ని పెంచుతోంది.
కొత్త ఉపరాష్ట్రపతి ఈనెల 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ రోజు రాఖీపౌర్ణమి సెలవురోజైనప్పటికీ యథావిధిగా ఆ కార్యక్రమం కొనసాగనుంది. 12వ తేదీవరకు పార్లమెంటు జరుగనున్నందున చివరి రోజు కొత్త ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌హోదాలో సభను నిర్వహించే అవకాశం ఉంది.