లాక్డౌన్ కి సంవత్సరం.. ఏం నేర్చుకున్నాం..

-

లాక్డౌన్.. సంవత్సరం క్రితం ఈ మాట ఎవరికీ తెలియదు. కరెక్టుగా మార్చి 22వ తేదీ నుండి ఈ పద ప్రయోగం ఎక్కువైపోయింది. అంతకుముందు ఇతర దేశాల్లో ఈ విధానం అనుసరిస్తున్నప్పటికీ మన దగ్గర మాత్రం మార్చి 22వ తేదీన లాక్డౌన్ తెచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ లాక్డౌన్ మాట వినిపిస్తూనే ఉంది. ముందుగా మొదటి మూడు నెలలు ఇంట్లోనే ఉన్నాం. ఒక్కరూ కూడా బయటకి వెళ్ళకుండా, పనులన్నీ మానుకుని, ఖాళీగా ఇంట్లోనే కూర్చున్నాం. ఆ తర్వాత అది బోర్ కొట్టింది. ఇంట్లో కూర్చుని కూర్చుని విసుగెత్తిపోయారు.

మొదట్లో లాక్డౌన్ బాగుందని, దానివల్ల మన ఆత్మ పరిశీలనకి సమయం దొరికిందని అనుకున్నారు. కానీ దేనికైనా ఒక పరిధి ఉంటుంది కదా.. మరీ ఎక్కువ పరిశీలన కూడా బోర్ కొట్టేసింది. లాక్డౌన్ చాలా కుటుంబాలని దూరం చేసింది. కొన్ని కుటుంబాలని మరింత దగ్గర చేసింది. ఆన్ లైన్ వాడకం విపరీతంగా పెరిగి తలెత్తుకోనివ్వకుండా చేసింది. కరోనా వల్ల ఆత్మీయులు చనిపోయినా అంత్యక్రియలకి వెళ్ళలేని క్లిష్ట పరిస్థితులను తీసుకొచ్చింది. సినిమాల్లో మరీ డ్రామాగా చిత్రీకరించే సీన్లని కళ్ళముందు కనిపించేలా చేసింది.

ఆరోగ్యం గురించి ప్రాముఖ్యత ఎక్కువైంది. అదే సమయంలో దిగులు, భయం ఎక్కువయ్యాయి. ఎప్పుడు ఏమవుతుందో అన్న టెన్షన్ అధికం అయ్యింది. చిన్న పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడి వాళ్ళలో ఒక రకమైన వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యింది. చాలా మంది ఉద్యోగాలు పోయాయి. చాలా సంస్థలు మూతబడ్డాయి. ఎందరి జీవితాలో నాశనం అయ్యాయి. అబద్ధమో, నిజమో తెలియని పుకార్లు షికారు చేసాయి. వ్యాక్సిన్ కోసం చూసిన ఎదురుచూపులు, కరోనా ఎప్పుడు తగ్గుతుందన్న భయాలు, మళ్ళీ వేరే వైరస్ వస్తుందేమోనన్న టెన్షన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు, వందల కొద్ది భయాలు మనలో నాటుకుపోయాయి.

అవన్నీ లాక్డౌన్ తెచ్చినవే. మరి అవన్నీ ఎలా పోవాలి? ఎప్పుడు పోవాలి? ఆరోగ్యం మనచేతుల్లోనే ఉంది. కరోనా రాకుండా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపర్చుకుని, భయంతో కాకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అనుక్షణం భయపడుతూ అనవసర అనారోగ్యాలని కొని తెచ్చుకోవడం కంటే ప్రతీక్షణం ఆనందిస్తూ జాగ్రత్తలు పాటిస్తుంటే సరిపోతుంది. ఒక సంవత్సరం లాక్డౌన్ మనకి ఏం నేర్పించిందో ఒక్కసారి గుర్తుతెచ్చుకుంటే భవిష్యత్తులో ఏం చేయాలన్నది అర్థం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news