తిరుపతి ఉప ఎన్నిక పోరు ఆసక్తిగా మారింది. అధికార, విపక్షాలు గెలుపు కోసం సర్వశత్తులొడ్డుతున్నాయి. నేతలు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా రావడం తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఎవరి బలం ఏంటన్నది తెలియడంతో ప్రచారంలో ఆసక్తి చూపడం లేదు. ప్రధాన రాజకీయ పక్షాల అధినేతలు. కానీ అభ్యర్దుల విజయానికి వెనుకుండి వ్యూహాలకు పదును పెడుతున్నారు.
తిరుపతి ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వైఎస్‌ఆర్‌సీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఈ నాయోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. వైఎస్‌ఆర్‌సీపీ తరపున గురుమూర్తి బరిలో ఉండగా.. టీడీపీ నుంచి పనబాక లక్ష్మి పోటీలో నిలిచారు. బీజేపీ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాస్, మాజీ సీఎస్ రత్నప్రభల పేర్లు పరిశీలించిన అధిష్టానం రత్నప్రభను అభ్యర్ధిగా ప్రకటించింది.
2019 సాధారణ ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుచుకుంది వైసీపీ. 2014 ఎన్నికల్లోనూ ఈ స్థానంలో వైసీపీ అభ్యర్ధి వరప్రసాద్ గెలిచారు. 2019లో ఆయన అసెంబ్లీకి పోటీ చేయడంతో ఆయన స్థానంలో బల్లి దుర్గాప్రసాద్ బరిలో దిగి గెలిచారు. ఇప్పుడు కూడా అత్యధిక మోజార్టీతో గెలుస్తామని అంటోంది వైసీపీ. పార్టీ గుర్తు మీద జరిగిన మునిసిపల్ ఎన్నికల్లోనూ ప్రచారం చేయని సీఎం జగన్ తిరుపతి ఎన్నికల్లోను ప్రచారానికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కానీ మంత్రులను మొహరించి మెజార్టీ పై టార్గెట్లు పెట్టారు.
తెలుగు దేశం పార్టీ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అదే తమను గెలుపిస్తుందని అంటున్నారు టీడీపీ నేతలు. మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు ఫుల్ సైలెంట్ అయిపోయారు. తిరుపతి బై పోల్ బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించి ఆయన డైరెక్షన్ కే పరిమితం అయ్యారు. కుమారుడు లోకేశ్ తోనే ప్రచారాన్ని కానిచ్చేసాల ఉన్నారు.
ఇక బీజేపీ జనసేన కూటమికి తిరుపతి సీటు పై ముందు నుంచి వివాదం నెలకొంది. వీరి ప్రచారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణే ప్రధాన అస్త్రం. అయితే సీటు విషయంలో బీజేపీ అనుసరించిన ధోరణితో ఉపఎన్నిక పట్ల పవన్ కళ్యాణ్ కూడా అంటిముట్టనట్లే ఉన్నారు. ఇక ఏపీలో బీజేపీ సీన్ చూసి కేంద్ర పెద్దలు ఎవరు కూడా ప్రచారాం పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మొత్తానికి చూస్తే తిరుపతి ఉప ఎన్నికల్లో అగ్ర నేతల ప్రచారం లేకుండానే పని కానిచ్చేశాల ఉన్నారు.