క్షణానికో మారు మారిపోతున్న పరిణామాల రీత్యా మోడీ – షా ద్వయం ఊహించిన విధంగా మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చు అని తెలుస్తోంది. శివసేన నిర్ణయాల కారణంగానే ఇక్కడి పరిణామాలు మరింత ఏకపక్షంగా బీజేపీ వైపు మరలుతున్నాయని స్పష్టమయిన సంకేతాలు అందుతున్నాయి. దీంతో శివసేన రెండు గా చీలిపోవడం ఒకవర్గంతో బీజేపీ అధినాయకత్వం టచ్ లోకి వెళ్లడంతో రేపటి బలపరీక్షకు సంబంధించి ఉద్దవ్ ఠాక్రేకు ముచ్చెమటలు పోస్తున్నాయి.
విశ్వాసం వీగిపోతే బీజేపీ నేతృత్వంలో శివసేన రెబల్స్ కలిసి సర్కారు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ (మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత) నేతృత్వంలో కొన్ని రాజకీయ శక్తుల పునరేకీకరణ అన్నది సాధ్యం. ఏక్ నాథ్ షిండే కూడా బీజేపీతో టచ్ లోకి వచ్చి ఉమ్మడి సర్కారు ఏర్పాటుకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. శివసేన (బాల్ థాక్రే ) పేరిట ఓ పార్టీపెట్టేందుకు కూడా ఆయన సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే !
ఓవిధంగా భావోద్వేగ రాజకీయం నడిపిన ఉద్ధవ్ ఠాక్రే అందుకుఅనుగుణంగా పరిణామాలను మలుచుకోలేకపోయారు. అదేవిధంగా ఎంపీ సంజయ్ రౌత్ చెప్పిన మాటలు ఆయనకు మైనస్ అయ్యాయే కానీ ఏమాత్రంఅనుకూలించలేదు. కనుక రెబల్ ఎమ్మెల్యేలు అంతా అసోంలోని గుహవాటి క్యాంపును ఖాళీ చేసి ముంబయ్ కి చేరుకుని బీజేపీతో దోస్తీ చేసే అవకాశాలు కొట్టి పారేయలేం. బీజేపీ నేతృత్వంలో గతంలో మాదిరిగానే సుస్థిర పాలన అందించే విధంగా దేవేంద్ర ఫడ్నవీస్ చేస్తున్న ముమ్మర ప్రయత్నాలకు అమిత్ షా కూడా తోడు నిలిచారు. ప్రభుత్వ ఏర్పాటు చర్యలకు అవసరమైన మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఆయన ఇప్పటికే గవర్నర్ తో భేటీ అయి ఈ పరిణామాలను తనకు అనుగుణంగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.