తెలుగు వారి ఆత్మగౌరవం-గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ మాట విన్నప్పుడల్లా కూడా.. తెలుగు వారిగా నరాలు ఉప్పొంగుతాయి. మనకంటూ.. ప్రత్యేకత ఉంది. మనం ఒకరి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం లేదు.. అనే స్థాయిని నలుదెశలా కల్పించిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ మనకు కనిపిస్తారు. అయితే, ఇలాంటి తెలుగు ఖ్యాతిని ఖండాంతరాల్లోకి తీసుకువెళ్లిన.. పరిస్థితి నేడు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న మీడియా వర్గాలు.. దిగజార్చుతున్నాయనే భావన వ్యక్తమవుతోంది.
వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి రావడాన్ని చంద్రబాబు సహా ఆయనను సమర్ధించే ఓ వర్గం మీడియా కూడా సహించలేక పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిత్యం ఏదో ఒక రూపంలో దుమ్మెత్తి పోస్తూనే ఉంది. బాబు కనుసన్నల్లో నడుస్తూ.. ఆయన చెప్పినట్టు వ్యవహరిస్తున్న ఈ మీడియా.. జగన్ ఏం చేసినా.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతోందనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆయన ఎప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లినా.. కూడా దానిని కూడా వ్యతిరేక కోణంలో చూస్తూ.. ఆయనపై బురద జల్లడం అలవాటుగా మారింది.
ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలో జగన్ పర్యటనపై చంద్రబాబు అనుకూల మీడియాలో వచ్చిన కథనం తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక తెలుగు సీఎంను.. ఉత్తరాది పెద్దలు అగౌరవంగా మాట్లాడుతున్నారని “ఏంటి జగన్?!“ అంటూ వ్యాఖ్యానించి.. ఆయనను నిలదీశారని, ఢిల్లీలోని బీజేపీ పెద్దల ముందు.. జగన్ చేతులుకట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై వారు జగన్‌కు తలంటేశారని సదరు మీడియా రాసుకురావడంపై.. తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మీకు జగన్ అంటే ఇష్టం లేదు. సరే! ఆయనను విమర్శించండి.. కానీ, ఆయన ఓ తెలుగు వాడు. అనే విషయాన్ని మాత్రం మరిచిపోవద్దు. ఢిల్లీలోనే కాదు.. తెలుగు వారు ఎక్కడ ఉన్నా.. గౌరవంగా ఉన్నారనే భావనతో చూడండి.. అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మీ కసి, ఆక్రోశం.. ఆగ్రహం అంతా.. రాష్ట్రంలో చూపించుకోవాలని, ఢిల్లీ పెద్దలు ఏమన్నారో.. కూడా తెలియకుండా .. తెలిసింది.. సమాచారం.. అంటూ.. లేనిపోని అభూత కల్పనలను సృష్టించి తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బదీయడం ఎందుకు ? అని ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా..!
-Vuyyuru Subhash