తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించనంతవరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.
బుధవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఆర్టికల్ 170కి లోబడి ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ సీట్లను 225కు, తెలంగాణలోని సీట్లను 153కు పెంచాలని విభజన చట్టంలోని సెక్షన్ 26(1) చెబుతోందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను 2026 తర్వాత జనాభా లెక్కలు ప్రచురించేంతవరకూ పెంచడానికి వీల్లేదని పేర్కొంటోందని చెప్పారు. అందువల్ల విభజన చట్టంలోని సెక్షన్ 26కి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయకుండా సీట్ల పెంపు సాధ్యం కాదని స్పష్టం చేశారు.