సౌరవ్ గంగూలీకి గుండెపోటు అనే వార్తతో క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. డేర్ అండ్ డైనమిక్‌గా ఉండే గంగూలీకి ఇంత తక్కువ వయసులో హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటని అభిమానులు కంగారు పడ్డారు. ఫిట్‌నెస్ గురించి, ఆహార నియమాల గురించి ఇలా యాడ్స్‌లో చెప్పే గంగూలీ.. ఇప్పుడు అనారోగ్యంతో ఆసుపత్రిపాలయ్యారు. క్రికెటర్లు ఎంతో ఫిట్‌గా ఉండటం వల్ల.. వాళ్లకు హార్ట్ ప్రాబ్లమ్స్ రావని కొందరు అమాయకులు అనుకుంటుంటారు. కానీ, గంగూలీ యాడ్స్‌లో చెప్పినంత ఈజీగా హెల్త్ కండీషన్ ఉండదని అభిమానులకు అర్ధమవుతోంది… ఇప్పుడు క్రికెటర్ల ఫిట్ నెస్ పై కొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
బీసీసీఐ అధ్యక్షుడు, ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతాగా అభిమానులు పిలుచుకునే సౌరవ్ గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. శనివారం ఛాతిలో నొప్పితో కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ ఆసుపత్రిలో చేరిన దాదా.. క్రమంగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. సౌరవ్ గంగూలీ వయసు 48ఏళ్లే. పైగా ఎప్పుడు ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉంటాడు. ఇక దాదా గట్స్ గురించి చెప్పనవసరంలేదు. అలాంటి సౌరవ్ గంగూలీకి గుండెపోటు రావడం ఏంటా అని అభిమానులు కలవరపడ్డారు. ఫిట్‌నెస్ మీద దృష్టిపెట్టే గంగూలీ.. వర్కవుట్స్ చేస్తున్న సమయంలోనే ఛాతిలోనొప్పి వచ్చింది.
మామూలుగా ఫిట్‌నెస్ మీద దృష్టిపెట్టి,క్రమం తప్పకుండా వ్యాయామం చేసినవారికి, ఆహార నియమాలు పాటించేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ, గంగూలీకి మాత్రం హార్ట్ స్ట్రోక్ రావడానికి ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ కూడా కారణంగా తెలుస్తోంది. గతంలో ఆయన కుటుంబసభ్యులకు కూడా ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది.
క్రికెటర్లు ఫిట్‌నెస్ మీద ఎక్కువగా కాన్‌సన్‌ట్రేట్ చేస్తారు. కాబట్టి వాళ్లకు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ అనే అపోహ ఉంటుంది. కానీ, గత ఏడాది అక్టోబరులో కపిల్ దేవ్‌కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. యాంజియోప్లాస్టీ తర్వాత 62ఏళ్ల కపిల్ దేవ్..కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. క్రికెట్ తర్వాత గోల్ఫ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న హర్యానా హరికేన్‌కు కూడా హార్ట్ స్ట్రోక్‌తో ఇబ్బందిపడ్డాడు..
అయితే గంగూలీ మాత్రమే కాదు.. గతంలో చాలామంది క్రికెటర్లకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆస్ట్రేలియా క్రికెట్ లెజండ్, కామంటేటర్ డీన్ జోన్స్.. గత ఏడాది హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయాడు. ఐపీఎల్ కామెంటరీ కోసం ప్రిపేర్ అవుతున్నజోన్స్.. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం క్రికెట్ ప్రపంచాన్ని కలవరపెట్టింది. క్రికెటర్లకు గాయాలు కామనే కానీ.. ఇలా సీరియస్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వారి లిస్టులో క్రిస్ గేల్, వినోద్ కాంబ్లీ, టోనీ గ్రెగ్,బాబ్ వూమర్, వేన్ పార్నల్, షేన్ వా్ట్సన్ కూడా ఉన్నారు.