అధికారపార్టీ ఒత్తిళ్లు..టీడీపీలో కొత్త పదవులు..డిఫెన్స్ లో పడ్డ సీనియర్ ఎమ్మెల్యే…!

-

అధికార పార్టీ నుండి ఉన్న ఒత్తిడులు చాలవన్నట్టు టీడీపీలో కొత్తగా ఇచ్చిన బాధ్యతలు ఆ ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారాయట. ఎమ్మెల్యే సైకిల్ దిగి వెళ్లిపోకుండా ఇటీవల బాపట్ల పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం జిల్లా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్న చందంగా మారిందట. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఎమ్మెల్యే నలిగిపోతున్నారట. ఒకపైపు రాజకీయ భవిష్యత్‌.. మరోవైపు వ్యాపారాలు కాపాడుకోలేక సతమతం అవుతున్నారట.

అధికార పార్టీకి జై కొట్టాలని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి పై చాలా ఒత్తిడి ఉంది. వీటి నుంచి ఎలా బయటపడాలా అని అనుకుంటున్న సమయంలో పార్టీ అప్పగించిక కొత్త బాధ్యతలు షాక్‌ ఇచ్చాయట. బాపట్ల పార్లమెంట్ పరిధిలోనే టీడీపీకి చెందిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు. వీరిపై కూడా పార్టీ మారాలనే ఒత్తిళ్లు ఉన్నాయి.

కొన్ని నెలలుగా ఏలూరి, అనగాని, గొట్టిపాటి ముగ్గురూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారట. ఇప్పుడు ఏలూరుకి పదవి ఇచ్చి మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు చేజారి పోకుండా చూడాల్సిన బాధ్యతలు కూడా టీడీపీ అధిష్టానం ఆయనకే అప్పగించిందట. ఈ విషయం చెప్పినప్పటి నుంచి ఆయనకు కంటి పై కునుకు లేదట. ఒక్క దెబ్బకి మూడు పిట్టలు అన్నట్టు టీడీపీ అధిష్టానం వేసిన ఈ స్కెచ్‌ పై పార్టీ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news