ఏపీలో సీఎం జగన్ చర్యలతో వైసీపీ నేతల్లో ఒక్కటే టెన్షన్ స్టార్ట్ అయ్యింది. చంద్రబాబు ఐదేళ్ల పాటు ఎలాంటి రాంగ్ స్టెప్పులు వేసి టీడీపీని, ఆ పార్టీ నేతలను నిలువునా ముంచేశాడో ఇప్పుడు జగన్ సైతం అదే బాటలో వెళుతుండడంతో వైసీపీ నేతలు తమ బాధ పైకి చెప్పుకోకపోయినా లోలోన జగన్ తీరుపై రగులుతోన్న పరిస్థితే ఉంది. చంద్రబాబు సీఎం అయినా వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. మరో ముగ్గురు ఎంపీలు కూడా నాడు సైకిల్ ఎక్కారు. వీరితో ఉపయోగం లేదని నాడు టీడీపీ కేడర్ మొత్తుకున్నా బాబు వినలేదు.
పైగా పార్టీ మారిన నేతలకు మంత్రి పదవులు ఇచ్చారు. పార్టీ నుంచి గెలిచిన సీనియర్లను కాదని మరీ బాబు జెండా మార్చేసిన నేతలను బాగా ఎంకరేజ్ చేశారు. చివరకు ఎన్నికల వేళ ఈ పాత నేతలు, జంపింగ్ నేతలు ఒకరు ఒకరిని ఓడించుకునే ప్రయత్నం చేయడం కూడా పార్టీ మునిగిపోవడానికి గల కారణాల్లో ఒకటి. కట్ చేస్తే జగన్ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు జగన్ కూడా నాడు చంద్రబాబు బాటలోనే వెళుతున్నాడని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
పార్టీ 151చోట్ల గెలిచింది.. మరో 24 చోట్ల మాత్రమే ఓడింది. అక్కడ బలమైన నేతలను ఎంకరేజ్ చేసి.. పార్టీని పటిష్టం చేసుకోవాల్సింది పోయి.. టీడీపీ నుంచి, జనసేన నుంచి గెలిచిన నేతలను ఎంకరేజ్ చేస్తూ పార్టీలో చేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదని వైసీపీ నేతలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా జగన్ మాత్రం టీడీపీని టార్గెట్ చేసే క్రమంలో వీళ్లను ఆ పార్టీకి దూరం చేస్తున్నారు. నాడు చంద్రబాబు సంతలో పశువుల్లా వైసీపీ ఎమ్మెల్యేలను కొంటున్నారని మనం విమర్శించామని.. మరి మనం ఇప్పుడు చేస్తోందేంటన్న ప్రశ్నలు వైసీపీ వర్గాల్లో వస్తున్నాయి.
ఇక ఇప్పుడు వైసీపీలోకి వస్తోన్న వారిలో చాలా మంది పదువల కోసమే, వ్యాపారల కోసమే పార్టీ మారుతున్న వారే ఉన్నారే తప్పా పార్టీపై ప్రేమ ఉన్న వారు లేరని వైసీపీ నేతలు వాపోతున్నారు. వైసీపీకి దగ్గరైన ఎమ్మెల్యే వంశీ, గిరి, కరణం బలరాం అంతా తమ రాజకీయ భవిష్యత్తు కోసమే పార్టీ మారిన వారు. ఇక సిద్ధా రాఘవరావు లాంటి నేతలు కేవలం వ్యాపార కోసమే పార్టీ మారారని వైసీపీ వాళ్లే చెపుతున్నారు. ఇక రేపో మాపో పార్టీ మారే వారు కూడా స్వలాభం కోసమే వస్తున్నారని.. వారిని పార్టీలో చేర్చుకోవడం వల్ల పార్టీకి దెబ్బే తప్పా ఒరిగేదేంలేదని.. ఈ విషయం జగన్ గ్రహించకకపోతే పార్టీకి ఎదురు దెబ్బేనని వైసీపీ వాళ్ల మనోవేదన..?