కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమయ్యాయి. ఎంతో మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఇక ఇప్పటికీ నడుస్తున్న అనేక సంస్థల్లో ఉద్యోగులకు జీతాలు సరిగ్గా అందడం లేదు. ఈ క్రమంలోనే అలాంటి ఓ కంపెనీలో పనిచేస్తున్న యాంకర్ Anchor తన గోడును లైవ్‌లోనే వెళ్లబోసుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
జాంబియా దేశానికి చెందిన కేబీఎన్‌టీవీ చానల్‌లో కబిందా కలిమినా అనే వ్యక్తి యాంకర్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఇటీవలే అతను చానల్‌లో లైవ్ న్యూస్ చదువుతూ సడెన్ గా తమకు కంపెనీ జీతాలు ఇవ్వడం లేదని చెప్పాడు. తామూ మనుషులమేనని, పనిచేస్తున్నామని, జీతాలు ఇవ్వాల్సిందేనని అన్నాడు. కొందరు జర్నలిస్టులు ఈ విషయాన్ని మాట్లాడేందుకు భయ పడుతున్నారని, కానీ తనకు ఎలాంటి భయం లేదని, తమతో పని చేయించుకుంటున్నారు కానీ జీతాలు ఇవ్వడం లేదని అన్నాడు.
అయితే దీనిపై కేబీఎన్ టీవీ చానల్ స్పందించింది. కలిమినా తాగి వచ్చాడని, ఆ సమయంలో న్యూస్ చదువుతూ ఆ విధంగా మాట్లాడాడని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదన్న మాట అవాస్తవమని, కలిమినా విషయంలో విచారణ చేస్తున్నామని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
కానీ టీవీ చానల్ యాజమాన్యం ఇచ్చిన వివరణపై కలిమినా స్పందించాడు. తాను మద్యం సేవించలేదని, వారు డ్రామాలు ఆడుతున్నారని, మద్యం సేవించి వస్తే న్యూస్ చదివేందుకు ఎలా అనుమతిస్తారని అతను ప్రశ్నించాడు. కాగా అతను లైవ్‌లోనే తమ కంపెనీని విమర్శించిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.