రానున్న 1000 రోజుల్లో మార‌నున్న 4.5 ల‌క్ష‌ల గ్రామాల రూపు రేఖ‌లు.. 20 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు..

-

రానున్న 1000 రోజుల్లో దేశంలోని 4.5 ల‌క్ష‌ల గ్రామాల రూపురేఖ‌లు మార‌నున్నాయి. గ్రామాల్లో యువ‌త‌, మ‌హిళ‌ల‌కు ఉపాధి అవ‌కాశాలు పుష్క‌లంగా ల‌భ్యం కానున్నాయి. ఇక‌పై గ్రామాల్లో ఉండే వారు ప్ర‌తి ప‌నికీ సిటీల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అలాగే ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ తిర‌గాల్సిన ప‌ని కూడా ఉండ‌దు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆగ‌స్టు 15న చెప్పారు గుర్తుంది క‌దా.. రానున్న 1000 రోజుల్లో దేశ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ ద్వారా అత్య‌ధిక స్పీడ్ తో ఇంట‌ర్నెట్‌ను అందిస్తామ‌న్నారు. అయితే ఆ క‌ల సాకారం అయ్యే సంద‌ర్భం మ‌రెంతో దూరంలో లేదు.

next 1000 days 4.5 lakh villages will transform

రానున్న 1000 రోజుల్లో 4.5 ల‌క్ష‌ల గ్రామాల్లో ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ ద్వారా ప్ర‌జ‌ల‌కు అత్య‌ధిక స్పీడ్‌తో ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం క‌ల్పిస్తారు. అయితే అందుకు గాను ఇప్ప‌టికే 1.5 ల‌క్ష‌ల గ్రామాల్లో ఆప్టిక‌ల్ ఫైబ‌ర్‌ను ఏర్పాటు చేశారు. మిగిలిన గ్రామాల్లోనూ గ‌డువులోగా ఆప్టిక‌ల్ ఫైబ‌ర్‌ను వేయ‌నున్నారు. దీంతో అన్ని గ్రామాలు ఇంట‌ర్నెట్‌కు అనుసంధానం అవుతాయి. ఈ సంద‌ర్భంగా కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ (సీఎస్‌సీ) సీఈవో దినేష్ త్యాగి మాట్లాడుతూ గ్రామాల్లో ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ కేబుల్ ద్వారా ఇంట‌ర్నెట్ అందుబాటులోకి వ‌స్తే ప్ర‌తి గ్రామంలోనూ ఒక కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తార‌ని తెలిపారు. దాని వ‌ల్ల ఒక్కో సెంట‌ర్‌లో 5 మందికి ప్ర‌త్య‌క్షంగా ఉపాధి ల‌భిస్తుంద‌ని, మొత్తంగా 20 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు ల‌భిస్తాయ‌న్నారు.

అలాగే కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ ద్వారా గ్రామాల్లోని యువ‌త, నిరుద్యోగులు ఉద్యోగ‌, ఉపాధి, విద్య‌, వైద్య అవ‌కాశాల‌ను పొంద‌వ‌చ్చ‌న్నారు. ప్ర‌తి గ్రామానికి ఒక విలేజ్ లెవ‌ల్ ఎంట‌ర్‌ప్రిన్యూర్‌ను ఏర్పాటు చేస్తారు. అలాగే బ్యాంకింగ్ స‌దుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. దీని వ‌ల్ల రైతులు త‌మ పంట‌ల‌ను నేరుగా త‌మ ఇండ్ల నుంచే అమ్ముకోవ‌చ్చు.

ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ ద్వారా గ్రామాల్లో అత్య‌ధిక స్పీడ్‌తో ఇంట‌ర్నెట్‌ను అందించేందుకు వీలు క‌లుగుతుంది. దీంతో గ్రామ‌స్థులు త‌మ ఉత్ప‌త్తుల‌ను నేరుగా ఈ-కామ‌ర్స్ సైట్ల‌లో అమ్ముకోవ‌చ్చు. కాగా కేంద్ర ప్ర‌భుత్వం భార‌త్ నెట్ కార్యక్ర‌మంలో భాగంగా దేశ‌వ్యాప్తంగా ఉన్న గ్రామాల‌కు ఇంట‌ర్నెట్ స‌దుపాయాన్ని క‌ల్పించ‌నుంది. అయితే క‌రోనా వ‌ల్ల ఈ కార్య‌క్ర‌మం కొంత వ‌ర‌కు ఆల‌స్యంగా జ‌రుగుతున్నా.. మోదీ ఆగ‌స్టు 15న దీనికి 1000 రోజుల డెడ్‌లైన్ విధించారు. అందువ‌ల్ల ఈ కార్య‌క్ర‌మం అనుకున్న స‌మ‌యానికి పూర్త‌వుతుంద‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే దేశంలోని గ్రామాల్లో ఉండే ప్ర‌తి ఒక్క‌రూ ఉపాధిని పొందుతారు. త‌ద్వారా భార‌త్ ఆర్థిక స్వావ‌లంబ‌న‌, సుస్థిర ప్ర‌గ‌తిని సాధిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news