NIA: ‘అబ్దుల్‌ బారిక్‌ ఆచూకీ చెబితే నజరానా’

-

బంగ్లాదేశ్‌ యువతుల్ని ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టి భారత్‌లోకి అక్రమంగా దిగుమతి చేసిన ముఠా సూత్రధారి, బంగ్లాదేశ్‌ జాతీయుడు అబ్దుల్‌ బారిక్‌ షేక్‌ కోసం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) గాలింపు తీవ్రం చేసింది. బారిక్‌తో పాటు ఇదే కేసులో ఏడో నిందితుడు, మహారాష్ట్ర థానేలో నివసించిన షరీపుల్‌ షేక్‌ ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష చొప్పున బహుమతులిస్తామని ప్రకటించింది. వీరు బంగ్లా యువతులను పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం, 24 పరగణాల జిల్లా ద్వారా దేశం దాటించి హైదరాబాద్‌ సహా పలు మెట్రో నగరాల్లో వ్యభిచారం చేయిస్తున్నారు.

ఈ ముఠా తొలుత 2019 సెప్టెంబరులో రాచకొండ పోలీసులకు చిక్కారు. అంతర్జాతీయ ముఠా కావడంతో ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. ఈకేసులో ఇప్పటికే 12 మందిపై అభియోగాలు మోపింది. వీరిలో 9 మంది బంగ్లాదేశ్‌ జాతీయులున్నారు.

ఎన్‌ఐఏ దర్యాప్తులో బంగ్లాదేశ్‌లోని జెస్సోర్‌ జిల్లా బాక్రా గ్రామానికి చెందిన అబ్దుల్‌ బారిక్‌ షేక్‌తోపాటు పశ్చిమబెంగాల్‌కు చెందిన రుహుల్‌ అమీన్‌ డాలీలు ప్రధాన సూత్రధాలుగా తేలింది. వీరిద్దరూ అసద్‌ హసన్‌, షరీఫుల్‌ షేక్‌, మహ్మద్‌ యూసుఫ్‌ఖాన్‌, బిత్తీబేగం, మహ్మద్‌ అల్‌ మమూన్‌, సోజిబ్‌ షేక్‌, సురేశ్‌కుమార్‌ దాస్‌, మహ్మద్‌ అబ్దుల్లా మున్షి, మహ్మద్‌ రాణా హుస్సేన్‌(బంగ్లాదేశ్‌)తో కలిసి వ్యభిచార దందా కొనసాగిస్తున్నట్లు తేలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version