దోమల కారణంగా..ఎన్నో రోగాలు వస్తాయి. వాటి భారిన పడకుండా ఉండేందుకు మనం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ అవి కుట్టేది కుట్టేదే అంటాయి. చాలా మంది ఇంటి డోర్లకు మెష్‌లు పెట్టుకుంటారు. మస్కిటో రిఫిల్స్, దోమల బ్యాట్స్ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉన్నాయి. అసలు ఈ భూమి మీద పుట్టే ప్రతి ప్రాణికి ఒక అర్థం ఉంటుంది..మరి ఈ దోమల వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇవి లేకుండా ఉంటే బాగుంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా..? దోమలే లేని దేశం ఒకటి ఉంది. అక్కడ మీరు భూతదద్దం పెట్టి వెతికినా ఒక్క దోమ కనిపించదట..!
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఐస్‌లాండ్. దోమలు, పాములు, పాకే జీవులు కనిపించని దేశం ఇది. కొన్ని రకాల సాలెపురుగులు ఇక్కడ కనిపిస్తున్నప్పటికీ, వాటిలో ఏవీ మానవులకు ప్రాణాంతకం కావు. ఐస్‌లాండ్‌తో పాటు అంటార్కిటికా కూడా దోమలు లేని ప్రదేశం
కారణాలు ఇవేనా..!
ఐస్‌లాండ్‌లో చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడి వాతావరణం వల్ల దోమలు బతకలేవని నిపుణులు చెబుతున్నారు. ఐస్‌ల్యాండ్ వెబ్ ఆఫ్ సైన్స్ వెబ్‌సైట్ ప్రకారం.. దోమలు ఐస్‌లాండ్‌లో అస్సలు కనిపించవు కానీ పొరుగు దేశాలలో కనిపిస్తాయి. ఈ దేశ వాతావరణం వేగంగా మారుతుంది. దీని కారణంగా దోమలు తమ జీవిత చక్రాన్ని సమయానికి పూర్తి చేయలేకపోతున్నాయి
ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, నీరు గడ్డకట్టినప్పుడు, దోమ ప్యూపా పూర్తిగా అభివృద్ధి చెందదు. ఇక్కడ దోమలు పుట్టకపోవడానికి ఇదే కారణం. మరొక కారణం ఏమిటంటే.. ఐస్‌లాండ్‌లో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇది -38 °C వరకు చేరుకుంటుంది. ఇక్కడ నీరు చాలా తేలికగా గడ్డకడుతుంది.ఇది దోమల పెరుగుదలకు అసాధ్యంగా మారే పరిణామం. మరొక సిద్ధాంతం ఏమిటంటే, ఐస్లాండ్ నీరు, నేల, సాధారణ పర్యావరణ వ్యవస్థ రసాయన కూర్పు దోమల జీవితానికి మద్దతు ఇవ్వదు.
మొత్తానికి అక్కడి వాతావరణ పరిస్థితులు వల్ల దోమల దందా అక్కడ సాగడం లేదు. దోమలే లేని దేశం.. అబ్బా ఆ ఊహ ఎంత బాగుందో కదా..!