తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే రూ. 1000 జరిమానా విధించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
తాజా ఉత్తర్వుల్లో బహిరంగ ప్రదేశాల్లో, పని చేసే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి రూ. 1000 ఫైన్ వసూలు చేయాలని ఆదేశించారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తెలంగాణలో ఎక్కువగా ఉందని మరో నాలుగు వారాల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను కోరారు. కేసుల సంఖ్య ఇలా పెరిగిపోతే రాష్ట్రంలో రోగులకు కనీసం బెడ్స్ కూడా దొరకని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఫైన్ లకు భయపడి కాకుండా కరోనాకు భయపడి మాస్క్ లు పెట్టుకోవాలని సూచనలు చేస్తున్నారు.