33శాతం రిజర్వేషన్ కాదు కాదు యాభై శాతం సీట్లు.. ఇవన్నీ గాలి కబుర్లు అయినా కూడా ప్రధాన పార్టీలకు మగువలంటే ఎంతో గౌరవం మరియు ప్రేమ కూడా! ప్రేమ ఓటు బ్యాంకు రాజకీయాల వరకూ! గౌరవం సీట్లు కేటాయించినా పెత్తనం మాత్రం పురుషులదే అయినంత వరకూ! కనుక పంజాబ్ గురించి కొంచెం తక్కువగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆ విధంగా నడుచుకోకుంటే ఇబ్బందే!
మాటలు మాత్రం భలే ఉంటాయి. అవి కోటలు దాటి ఉంటాయి. కానీ పంజాబ్‌లో ప్రధాన పార్టీలు మాత్రం మాటలకు, చేతలకు పొంతన అన్నది లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఉందామనుకుంటున్న మహిళలకు, అత్యున్నత చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందని భావిస్తున్న మహిళలకు గౌరవం దక్కడం లేదని తేలిపోయింది. మరి! మగువలను ఆకట్టుకోవడం మాత్రం ఎలా? అనుకుంటున్నారా అందుకు ఓ మార్గం ఉంది.. అవే పథకాల పేరిట బురిడీ కొట్టించడం తప్ప ఇక్కడ ప్రధాన పార్టీలకు మహిళా శక్తి అంటే ఓటు బ్యాంకు రాజకీయమే అని తేలి పోయింది.
ఈ నేపథ్యంలో పంజాబ్ ఎన్నికలకు సంబంధించి మరో కొత్త ట్విస్టు ఒకటి వెలుగు చూసింది. 117 నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 15న నోటిఫికేషన్ సైతం విడుదలైంది. మరి! ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. ఇంతటి గొప్ప ఎన్నికల వేళ, మహిళలను మహరాణులను చేయాల్సిందే కదా! కానీ చేస్తున్నారా అంటే అబ్బే! అదేం లే దనే తేలిపోయింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన టిక్కెట్లు అన్ని ప్రధాన పార్టీలూ కూడా ఎనిమిది నుంచి పది శాతం వరకూ మాత్రమే అని తేలిపోయింది.
మహిళా సాధికారికత అని డబ్బా కొట్టే పార్టీలకు ఎందుకని మహిళలను గౌరవించాలని, వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అనిపించడం లేదో? అధికారంలో ఉన్న కాంగ్రెస్ మొదలుకుని శిరోమణి అకాలీదళ్,ఆమ్ ఆద్మీ పార్టీ, సంయుక్త సమాజ్ మోర్చా ఇలా ఏ పార్టీ కూడా మహిళలను గౌరవించి పోటీ చేయిస్తున్న దాఖలాలే లేవని ప్రధాన మీడియా చెబుతోంది.
గతంలో మహిళలకు 33 నుంచి 50శాతం సీట్లు కేటాయిస్తమన్న ప్రధాన పార్టీలు ఆ మాటను మరిచేపోయాయి కూడా ప్రధాన మీడియా ఘోషిస్తోంది. పార్టీల వారీగా చూసుకుంటే కాంగ్రెస్ ఇప్పటిదాకా ప్రకటించిన అభ్యర్థులు 86 మంది కాగా అందులో 9 మంది మాత్రమే మహిళలు ఉన్నా రు అంటే ఆశ్చర్యపోవడం మనవంతు. ఇదే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యం అంతంతమాత్రమే!