మానసిక పరిస్థితి సరిగ్గా లేని ఒక యువకుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకే హాని తలపెడతానని వార్నింగ్ ఇచ్చాడు. అది కూడా పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 100 కు ఫోన్ చేసి మరీ చెప్పాడు. ఉత్తర్‌ప్రదేశ్ లోని నోయిడాలో జరిగిన ఈ ఘటనతో పోలీస్ యంత్రంగా ఒక్కసారిగా అప్రమత్తం అయింది. ఎట్టకేలకు ఆ యువకుడ్ని పట్టుకున్నారు. పూర్తి వివరాలు పరిశీలిస్తే.. హర్యానా రాష్ట్రానికి చెందిన హర్‌భజన్ సింగ్ అనే యువకుడు నోయిడాలో నివాసముంటున్నాడు. అయితే సదరు యువకుడు డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు.
ఆ అలవాటు కాస్త వ్యాసనంగా మారింది. దీంతో అతని మానసిక పరిస్థితి కాస్త క్షీణించింది. తాజాగా.. ఆ యువకుడు 100 పోలీసు ఎమర్జెన్సీ ఫోన్ నంబరుకు ఫోన్ చేసి ప్రధాని మోదీకే హాని తలపెడతానంటూ బెదిరించాడు. దీంతో అప్రమత్తమై రంగంలోకి దిగిన నోయిడా ఫేజ్ 3 పోలీసులు నిందితుడైన హర్‌భజన్ సింగ్ ను పట్టుకున్నారు. కాగా, ప్రశ్నించే క్రమంలో అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలుసుకున్న పోలీసులు వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. ఈ విషయాన్ని స్వయంగా నోయిడా అదనపు డీసీపీ అంకూర్ అగర్వాల్ తెలియజేశారు.