ఇప్పుడు చిరిగిన జీన్స్ ఫ్యాషన్ అప్పుడు అలా మొదలైందట..!

-

చిరిగిన చొక్కా అయినా కొనుక్కో..మంచి పుస్తకం కొనుక్కో అనేది సామెత. కానీ ఇది ఇప్పుడు ఫ్యాషెన్ అయింది. చిరిగిన చొక్కా బదులు..చిరిగిన జీన్స్ అంతే తేడా. అయితే మంచి పుస్తకం కొనుక్కోడానికి కాదు..మంచి పాష్ లుక్ కోసం అన్నట్లు. ఒకప్పుడు ఈ ఫ్యాషెన్ వచ్చిన కొత్తలో ఇలాంటి జీన్స్ వేసుకోవడానికి అందరూ ముందుకు వచ్చేవాళ్లు కాదు..కాస్త సిగ్గు, చూసేవాళ్లు ఏం అనుకుంటారో అన్న భయం. ముఖ్యంగా మన ఏరియాస్ లో అయితే..నానమ్మలు, అమ్మమ్మలు అయితే..ఇలాంటి జీన్స్ వేసుకుని వాళ్ల కంటపడితే..ఇజ్జత్ తీస్తారు ఇగ. మొదట మగవాళ్లు మాత్రమే ఈ ఫ్యాషెన్ ఫాలో అయ్యేవారు..ఇప్పుడు మహిళలు సైతం దీనికి అలవాటు పడిపోయారు. అసలు ఇది ఫ్యాషెన్ ఎలా అయింది, ఇంకా హైలెట్ ఏంటంటే..నార్మల్ జీన్స్ కంటే..చిరిగిన జీన్స్ ప్యాంట్ కాస్టే ఎక్కువ ఉంటుంది. అరే డబ్బులిచ్చి చిరిగిన బట్టలు కొనటం ఏంటి అనే డౌట్ మీకు ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. ఈరోజు ఇది ఫ్యాషెన్ గా మారడానికి కారణం ఏంటో చూద్దాం.

ప్రస్తుతం ఫ్యాషన్‌ బ్రాండ్‌గా మారిన ఈ చిరిగిన జీన్స్‌లు ఒకప్పుడు పేదరికానికి ప్రతీకగా ఉండేవి. 1871లో జాకబ్‌ డబ్ల్యూ. డెవిస్‌ అనే అమెరికన్‌ టైలర్‌ తొలిసారి జీన్స్‌ను తయారు చేశాడు. ఆ కాలంలో పారిశ్రామీకరణ పెరగడంతో కార్మికులు పరిశ్రమల్లో గంటల తరబడి పనిచేసేవారు. అక్కడి వాతావరణానికి తగ్గట్టు కార్మికుల కోసం మన్నికైన దుస్తులు తయారు చేయాలన్న సంకల్పంతో జీన్స్‌ ప్యాంట్లను తయారుచేశారు. లెవి స్ట్రాస్‌ అనే వ్యాపారవేత్తతో కలిసి లెవి స్ట్రాస్‌ అండ్‌ కో బ్రాండ్‌తో పెద్దమొత్తంలో జీన్స్‌ తయారీ ప్రారంభించారు. కార్మికులు ఈ జీన్స్‌ ప్యాంట్లను కొనుగోలు చేసి ఏళ్లతరబడి వాటినే వేసుకునేవారు.

పాప్‌కల్చర్‌లో జీన్స్‌

1950ల్లో పాప్‌ సంస్కృతి పుట్టుకొచ్చింది. కార్మికులు వేసుకునే జీన్స్‌ దుస్తులనే మార్పులు చేసి పాప్‌ సింగర్లు, సినీ ప్రముఖులు వేసుకోవడం మొదలుపెట్టారు. సెలబ్రిటీల వస్త్రధారణను వాళ్ల అభిమానులు కూడా ఫాలో అవుతారుగా..కాబట్టి.. జీన్స్‌ ప్యాంట్లు ఫ్యాషన్‌గా మారిపోయాయి. ప్రపంచమంతా జీన్స్‌ పాపులర్‌ కావడంతో వాటి ధరలు కూడా బాగా పెరిగాయి. దీంతో ఎవరికోసమైతే జీన్స్‌ ఆవిష్కరించారో వారికే అవి దూరమయ్యాయి. కార్మికులు ఏళ్లతరబడి ధరించడం, అనేకసార్లు ఉతకడం వల్ల జీన్స్‌ ప్యాంట్లు చిరిగిపోయేవి. కొత్త జీన్స్‌కొనే ఆర్థిక స్థోమత లేక కార్మికులు చిరిగిన జీన్స్‌ ప్యాంట్లు ధరించే పనులకు వెళ్లేవారు. కొందరు చిరిగిన చోట దారంతో కుట్టుకునేవాళ్లు. దీంతో చిరిగిన జీన్స్‌ వేసుకున్న వాళ్లు కటిక పేదరికంలో ఉన్నవాళ్లుగా సమాజంలో ముద్రపడింది. ఈ క్రమంలో చిరిగిన జీన్స్‌ వేసుకున్న వారిపై వివక్ష పెరిగిపోయింది.

పంక్‌ ఫ్యాషన్‌లో చిరిగిన జీన్స్‌

పెట్టుబడిదారి వ్యవస్థ, గుత్తాధిపత్యం, కార్పొరేట్‌ వ్యవస్థ, సిద్ధాంతాలు, ఫ్యాషన్‌, కళ, నృత్యం, సినిమా, సాహిత్యం ఇలా సమాజంలో.. అన్ని విషయాలను వ్యతిరేకించేవారు కూడా చాలా మంది ఉండేవాళ్లు. అలాంటి వాళ్లను ఏకం చేస్తూ పంక్‌ సంస్కృతి ఆవిర్భవించింది. జీన్స్‌ కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని పేదవాళ్లను చులకనగా చూస్తున్న సమాజం పట్ల వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్లు. అందుకే, సమాజంపై కోపం, నిరసనకు ప్రతీకగా పంక్‌ రాక్‌ బ్యాండ్‌ సభ్యులు జీన్స్‌ ప్యాంట్లను కొనుగోలు చేసి వాటిని చింపి ధరించేవాళ్లు. బీటిల్స్‌, రామొనోస్‌ వంటి రాక్‌స్టార్స్‌ చిరిగిన జీన్స్‌ ధరించడంతో ఇదో ఫ్యాషన్‌గా తయారైంది. దీంతో కంపెనీలు చిరిగిన జీన్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఆ తర్వాత వాటితోపాటు అనేక రకాల జీన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. నెమ్మదిగా చిరిగిన జీన్స్‌ ఫ్యాషన్‌ కనుమరుగైంది.

2010 తర్వాత మళ్లీ ఫ్యాషన్‌ ప్రపంచంలోకి ఈ చిరిగిన జీన్స్‌ వచ్చేశాయి. డీజిల్‌, బాల్మెయిన్‌ తదితర కంపెనీలు చిరిగిన జీన్స్‌ను ‘డిస్ట్రెస్‌డ్‌’ జీన్స్‌ పేరుతో ఫ్యాషన్‌ షోల్లో ఉపయోగించాయి. ఆ తర్వాత ప్రజలకు ఇవి అందుబాటులోకి వచ్చాయి. అలా.. ఒకప్పుడు చిరిగిన జీన్స్‌ వేసుకుంటేనే చులకనగా చూసే వాళ్లు.. ఇప్పుడు జీన్స్‌ ఎంత చిరిగితే అంత ఫ్యాషన్‌గా మారిపోయింది. మీరు కూడా జీన్స్ వాడితే..కచ్చితంగా ఇలాంటి జీన్స్ ఒక్కటైనా ఉండే ఉంటుందిగా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version