ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో లో అరుదైన ఆవిష్కరణ చేపట్టింది హైదరాబాదులోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్. 15 విశిష్టమైన ఖనిజ లవణాలను గుర్తించింది ఎన్జిఆర్ఐ . ప్రజలు నిత్యం ఉపయోగించే సెల్ పోన్ల నుంచి టీవీల వరకు అనేక వస్తువుల్లో ఈ ఖనిజ లవణాలను వినియోగిస్తారని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు తెలిపారు. పరిశ్రమల్లోనూ వీటి వినియోగం ఉంటుందని వారు వెల్లడించారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు అనంతపురం జిల్లాలోని పలుచోట్ల సయనైటిస్ వంటి సంప్రదాయేతర శిలలపై పరిశోధనలు నిర్వహించారు. లాంథనైడ్ సిరీస్ లోని పలు మూలకాలు, ఖనిజ లవణాలను వారు గుర్తించారు.
వీటిలో అల్లనైట్, సెరియేట్, థోరైట్, కొలంబైట్, టాంటలైట్, అపటైట్, జిర్కోన్, మోనజైట్, పైరోక్లోర్ యూక్జెనైట్, ఫ్లోరైట్ తదితర ముఖ్యమైన ఖనిజ లవణాలు లభించాయి. ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త పీవీ సుందర్ రాజు మాట్లాడుతూ, రెడ్డిపల్లె, పెద్ద వడగూరు ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టామని వారు తెలిపారు. ఇక్కడ జిర్కోన్ పలు రూపాల్లో లభ్యమైందని తెలిపారు. ఇక మోనజైట్ గింజల రూపంలో, పలు రంగుల్లో దర్శనమిచ్చినట్టు వెల్లడించారు. ఇక్కడ రేడియో యాక్టివ్ మూలకాలు కూడా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. మరింత అధ్యయనం చేస్తే ఈ ఖనిజ లవణాల గురించి ఇంకా ఎంతో తెలుసుకోవచ్చని అన్నారు. వీటిని క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లోనూ వినియోగిస్తారని సుందర్ రాజు వివరించారు.