ఎన్టీఆర్ వర్శిటీ టూ వైఎస్సార్ వర్శిటీ.. అసెంబ్లీలో రచ్చ..!

-

జగన్ ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ రచ్చకు కారణమైంది. రాత్రికి రాత్రి విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ..జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే రాత్రి దీనికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇక అసెంబ్లీలో దీనికి సంబంధించి బిల్లుని ఆమోదించుకోవాలని వైసీపీ చూస్తుంది..

ఈ అంశంపై అసెంబ్లీలో టీడీపీ నేతలు స్పీకర్ పోడియం వద్ద నిరసనలు చేస్తున్నారు. ఎన్టీఆర్ పేరు మార్చవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై వైసీపీ మంత్రులు గట్టిగానే కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారు..ఆయన గురించి మాట్లాడే హక్కు లేదని టీడీపీపై ఫైర్ అవుతున్నారు. వైఎస్సార్ వైద్యరంగానికి ఎనలేని కృషి చేశారని, అందుకే ఎన్టీఆర్ పేరు మార్చి..వైఎస్సార్ పేరు పెడుతున్నామని వైసీపీ అంటుంది.

హైదరాబాద్‌లో కాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి..ఎన్టీఆర్… జయవాడలో హెల్త్‌ వర్సిటీ ఏర్పాటు చేయాలని 1983లో నిర్ణయించుకున్నారు. ఇక దీనికి మొదట పెట్టిన పేరు యునివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌. 1998 ఫిబ్రవరిలో, అంటే ఎన్టీఆర్‌ చనిపోయిన రెండేళ్లకు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పెట్టారు. ఇక ఇందులో వైఎస్సార్ జోక్యం ఏమి లేదు. అయితే అప్పటినుంచి ఎన్టీఆర్ వర్శిటీగానే నడుస్తోంది.

ఆఖరికి 2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక కూడా దీని మార్చలేదు. అయితే అనూహ్యంగా జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ తర్వాత ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ అని పెడుతున్నారు. మరి దీని వెనుక రాజకీయ కోణం ఉందో లేక..ఇంకా వేరే ఉద్దేశం ఉందో తెలియదు గాని…మొత్తానికి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పెట్టారు. దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టి, పాస్ చేయించుకొనున్నారు.దీనిపై టీడీపీ ఆందోళనలు చేస్తుంది.

36 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం అర్థరహితమని చంద్రబాబు ఫైర్ అయ్యారు. దశాబ్దాల క్రితం ఏర్పాటైన సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదని, వ్యవస్థలను, సంస్థలను నిర్మిస్తేనే పేరు వస్తుంది అనే విషయాన్ని సీఎం జగన్ తెలుసుకోవాలని బాబు హితవు పలికారు. అలాగే ఎన్టీఆర్ పేరుని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news