కోరి తెచ్చుకున్న అధికారులే ఆ మంత్రికి షాకిస్తున్నారా…?

ఉల్లిపాయలు ధరలు పెరిగితేనే ప్రభుత్వాలు మారిపోయిన చరిత్ర మనది. అలాంటిది మంచినీటి సమస్య వస్తే ఎలా ఉంటుంది. అప్పటి వరకూ వరుసగా గెలుస్తున్న వారిని కూడా ప్రజలు దించేస్తారు. ఒంగోలులో 2014లో ఇదే జరిగింది. సీనియర్‌ నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి తాగునీటి సమస్య ఇబ్బంది పెట్టింది. 2019లో గెలిచి మంత్రి అయిన తర్వాత ఎలాగైనా ఆ సమస్యకు పరిష్కారం చూపించాలని భావించారాయన. ఇందుకోసం ఏరికోరి కొందరు అధికారులను తెచ్చిపెట్టుకున్నారు. కానీ.. సమస్యను పరిష్కరించకపోగా మరింత జఠిలం చేసిందట ఈ నిర్ణయం.


ఒంగోలులో వారం పదిరోజులకు ఓసారి నీటి సరఫరా ఉండేది. శివారు కాలనీల్లో అయితే పరిస్థితి మరీ అధ్వాన్నం. 2014లో ఇదే అంశాన్ని ప్రచారంగా చేసుకుని టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌.. నాడు బాలినేనిపై నెగ్గారు. గత ప్రభుత్వ సమయంలో 3 రోజులకు ఓసారి మంచినీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎన్నికల్లో గెలుపోటములకు కీలకంగా మారిన సమస్యను పరిష్కరించే పనిలో పడ్డారాయన.

ఒంగోలు మున్సిపాలిటీలో తనకు అనుకూలంగా ఉండే అధికారులకు పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారు బాలినేని. మంచినీటి సమస్య లేకుండా చేయాలని చెప్పారట. కానీ.. నమ్మి తీసుకొచ్చిన మున్సిపల్‌ అధికారులే మంత్రి ఆదేశాలను పట్టించుకోలేదని టాక్‌. మంత్రినే లైట్‌ తీసుకున్నారో లేక.. అది పరిష్కరించలేని సమస్య అనుకున్నారో ఏమో కానీ.. హ్యాండ్సప్‌ అన్నారట. దీంతో ఇప్పటి వరకు 3 రోజులకు ఓసారి సరఫరా అవుతున్న తాగునీరు.. మళ్లీ పాత పరిస్థితికి వచ్చేసింది. పదిరోజులకు ఓసారి తాగునీరు వదలుతున్నారు. దీంతో జనాల్లో ఆగ్రహం మొదలైంది. వర్షాలు పడుతున్న సమయంలో తమకీ కష్టాలేంటని నిలదీస్తున్నారట. మొత్తానికి తాగునీటి సమస్య ఎన్నికల్లో బాలినేనిని ఇబ్బంది పెడితే.. ఇప్పుడు అధికారులు మంత్రిని ఇరుకున పెట్టారనే కామెంట్స్‌ జోరందుకున్నాయి.